ఆవిష్కరణలతో పేదలకు మేలు జరగాలి

శాస్త్రసాంకేతిక రంగాల్లో ఏ పురోగతి సాధించినా.. దాని ఫలాలు ముందుగా పేదలకు దక్కాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఉద్ఘాటించారు.

Updated : 29 Feb 2024 05:28 IST

ముందస్తు వ్యాధి నిర్ధారణ చికిత్సలో చాలా కీలకం
అంకుర పరిశ్రమలకు వేదికగా బయో ఏషియా సదస్సు
గవర్నర్‌ తమిళిసై ఉద్ఘాటన

ఈనాడు- హైదరాబాద్‌: శాస్త్రసాంకేతిక రంగాల్లో ఏ పురోగతి సాధించినా.. దాని ఫలాలు ముందుగా పేదలకు దక్కాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఉద్ఘాటించారు. ‘‘అల్ట్రాసౌండ్‌ వంటి నిర్ధారణ పరీక్షలు చేయించుకోలేక గ్రామీణ పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నాకు తెలుసు. మన దేశంలో వైద్యఖర్చులు చాలా ఖరీదైనవి. వాటిని తగ్గించే విధంగా నూతన ఆవిష్కరణలకు బయో ఏషియా సదస్సు వేదికైంది. శాస్త్ర సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆవిష్కరణ అనంతరం రొమ్ము క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన జబ్బులను కూడా ప్రారంభ దశలోనే మునుపటి కంటే 20 రెట్లు ఎక్కువ కచ్చితత్వంతో నిర్ధారణ చేయడం ఇప్పుడు సాధ్యమవుతోంది.  ముందస్తు వ్యాధి నిర్ధారణ చికిత్సలో చాలా కీలకం. పేద ప్రజలకు మేలు చేకూర్చేలా వైద్య శాస్త్ర సాంకేతిక రంగంలో మరిన్ని ఆవిష్కరణలు రావాలి’’ అని గవర్నర్‌ తమిళిసై ఆకాంక్షించారు. హెచ్‌ఐసీసీలో మూడు రోజుల పాటు జరుగుతున్న 21వ బయో ఏషియా సదస్సు ముగింపు వేడుకల్లో బుధవారం గవర్నర్‌ తమిళిసై ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. ‘‘ఫార్మా, జీవ వైద్య విజ్ఞాన  రంగంలో హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి సాధించింది.  అల్ట్రాసౌండ్‌ పరీక్షను కొత్త రోబోటిక్‌ విధానంలో చేయగలిగే ఆవిష్కరణ ఈ సదస్సు ద్వారా అందుబాటులోకి రావడం సంతోషంగా ఉంది. పేద రోగులకు సరసమైన ధరల్లో అందుబాటులోకి తెచ్చేలా.. దీన్ని రూపొందించిన అంకుర సంస్థకు బయో ఏషియాలో పురస్కారం దక్కడం ఆనందంగా ఉంది. మరిన్ని ఆవిష్కరణలు రావడానికి ఈ సదస్సు ప్రేరణగా నిలవాలి. నేను కూడా కరోనా నుంచి రక్షణ పొందడానికి భారత్‌ బయోటెక్‌ టీకా పొందాను. తెలంగాణలో తయారైన టీకా విదేశాలకు ఎగుమతి అవుతున్నప్పుడు నేను చెప్పలేనంత ఆనందాన్ని పొందాను’’ అని గవర్నర్‌ తమిళిసై తెలిపారు.


50వేల మందికి జీవ వైద్యంలో నైపుణ్య శిక్షణ: మంత్రి శ్రీధర్‌బాబు

జీవ వైద్యశాస్త్ర రంగంలో 50 వేల మంది స్థానిక గ్రాడ్యుయేట్లకు అయిదు నుంచి ఆరేళ్ల లోపు నైపుణ్య శిక్షణ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. బయో ఏషియా ముగింపు సదస్సులో భాగంగా ప్రపంచ ఆర్థిక వేదికకు అనుబంధంగా నెలకొల్పిన ‘సెంటర్‌ ఫర్‌ ది ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రెవల్యూషన్‌ తెలంగాణ’ కేంద్రాన్ని బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మెడికల్‌ కెమిస్ట్రీ, అనలిటికల్‌ కెమిస్ట్రీ పేరిట రెండు ప్రత్యేక కోర్సులను ప్రారంభించి నైపుణ్య శిక్షణ ఇప్పించనున్నాం. దీనికి సంబంధించిన మొదటి బ్యాచ్‌ను ప్రయోగాత్మకంగా వారం రోజుల్లోనే ప్రారంభించనున్నాం. హీమోఫిలియా అసోసియేషన్‌ సూచనతో మూడుచోట్ల ప్రయోగాత్మకంగా క్లినికల్‌ రిజిస్ట్రీకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తాం. రోగుల సంఖ్యను నమోదు చేయడం వల్ల వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్యసేవలు, ఆరోగ్య సంరక్షణపై వనరులను మెరుగ్గా కేటాయించడం సాధ్యమవుతుంది. వైద్య శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్తగా 10వేల ఉద్యోగాలను సృష్టించడం, 20-25 వర్ధమాన కంపెనీలు, స్టార్టప్‌లను పెంపొందించడం, రిజిస్ట్రీ ద్వారా 10-25 కొత్త ఆలోచనలను రూపొందించడం వంటి లక్ష్యాల దిశగా తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తోంది. భారతదేశ ఫార్మా ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం 40 శాతం వాటా కలిగి ఉంది. ప్రపంచానికి వ్యాక్సిన్‌ సరఫరాలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఇక్కడి నుంచి జరుగుతోంది. 1000 గ్లోబల్‌ హెల్త్‌కేర్‌, లైఫ్‌ సైన్స్‌ కంపెనీలకు నిలయంగా తెలంగాణ విరాజిల్లుతోంది’’ అని మంత్రి శ్రీధర్‌బాబు పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది కూడా బయో ఏషియా సదస్సు హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నట్లు శ్రీధర్‌బాబు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని