మార్గదర్శనం చేసేది మాతృభాష

ఇది సాంకేతిక యుగం.. విద్యార్థులకు విభిన్న నైపుణ్యాలను నేర్పించగలిగే విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘నూతన విద్యావిధానం-2020’ను తీసుకొచ్చిందని రాష్ట్ర గవర్నర్‌, తెలుగు విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌ డాక్టర్‌ తమిళిసై అన్నారు.

Published : 29 Feb 2024 03:29 IST

తెలుగు విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో గవర్నర్‌ తమిళిసై

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: ఇది సాంకేతిక యుగం.. విద్యార్థులకు విభిన్న నైపుణ్యాలను నేర్పించగలిగే విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘నూతన విద్యావిధానం-2020’ను తీసుకొచ్చిందని రాష్ట్ర గవర్నర్‌, తెలుగు విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌ డాక్టర్‌ తమిళిసై అన్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతి ప్రధాన మందిరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవం బుధవారం కనులపండువగా జరిగింది. ముందుగా ఆంధ్రనాట్య గురువు కళాకృష్ణకు ‘గౌరవ డాక్టరేట్‌’తో పాటు వర్సిటీలోని వివిధ శాఖల పట్టభద్రులకు ఎంఫిల్‌, పీహెచ్‌డీలు, వివిధ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారికి ప్రముఖుల పేరిట నెలకొల్పిన బంగారు పతకాలను గవర్నర్‌ తమిళిసై బహూకరించారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ.. మాతృభాష మధురమైందని, అది మనలో ఆత్మగౌరవాన్ని పెంచుతూ మార్గదర్శనం చేస్తుందన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా పట్టభద్రులైనవారు తెలుగు భాషలోని పరిమళాన్ని ప్రపంచానికి అందించాలని సూచించారు. వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ.. 30 బోధనాంశాలు, 52 సర్టిఫికెట్‌, డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ కోర్సులు, గ్రాడ్యుయేట్‌ పరిశోధన విభాగాలు, రెగ్యులర్‌ కోర్సులతో పాటు కొన్ని సాయంకాల కోర్సులను విశ్వవిద్యాలయం నిర్వహిస్తోందన్నారు. గౌరవ డాక్టరేట్‌ అందుకున్న కళాకృష్ణ స్నాతకోపన్యాసం చేస్తూ.. గురుముఖంగా గురుకులాల్లో నేర్చుకునే లలితకళలు ఆశ్రమాలు దాటి విశ్వవిద్యాలయాలకు చేరడం గొప్ప పరిణామమన్నారు. 1,189 మందికి డిగ్రీలు, 78 మందికి ఎంఫిల్‌, పీహెచ్‌డీలు, మొత్తం 61 మందికి మందికి స్వర్ణ పతకాలను ప్రదానం చేశారు.

జర్నలిస్టు మల్లాదికి స్వర్ణపతకం

‘ఆధ్యాత్మిక పత్రికలు-భాష, విషయ విశ్లేషణ’ అంశంపై ఎంఫిల్‌ పరిశోధన చేసిన జర్నలిస్టు మల్లాది వేంకట గోపాలకృష్ణకు ‘బొప్పన్న స్మారక స్వర్ణ పతకం లభించింది. తెలుగువర్సిటీ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్‌ డా.తమిళిసై చేతుల మీదుగా ఆయన బంగారు పతకాన్ని, డిగ్రీ పట్టాను అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని