వయో పరిమితి పెంపుపై వినతిని పరిశీలించండి: హైకోర్టు

గ్రూప్‌-1 సర్వీసు పోస్టులకు ఫిబ్రవరి 19న జారీ చేసిన నోటిఫికేషన్‌తో పాటు రాబోయే నోటిఫికేషన్‌లో వయోపరిమితిని 46 నుంచి 51కి పెంచాలన్న నిరుద్యోగుల వినతి పత్రాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated : 29 Feb 2024 03:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1 సర్వీసు పోస్టులకు ఫిబ్రవరి 19న జారీ చేసిన నోటిఫికేషన్‌తో పాటు రాబోయే నోటిఫికేషన్‌లో వయోపరిమితిని 46 నుంచి 51కి పెంచాలన్న నిరుద్యోగుల వినతి పత్రాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2017 నుంచి ఎలాంటి నోటిఫికేషన్‌ విడుదల కానందునా వయోపరిమితి 46 నుంచి 51 వరకు పెంచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఎ.శ్రీనివాసరెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ విచారణ చేపట్టారు. వినతి పత్రాన్ని చట్ట ప్రకారం 4 వారాల్లో పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

ఉమ్మడి గుర్తు పొందడం ప్రాథమిక హక్కు కాదు

ఉమ్మడి గుర్తు పొందడం అన్నది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు కాదని హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 29ఏతోపాటు ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రాథమిక హక్కుకు నియంత్రణ ఉంటుందని పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేసేందుకు ఉమ్మడి గుర్తును కేటాయించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ యువశక్తి పార్టీ తరఫున అధ్యక్షుడు బి.రామ్మోహన్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గుర్తును ఎన్నికల నియమావళి, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మాత్రమే ఎన్నికల సంఘం కేటాయిస్తుందని, ఇందులో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని