రాష్ట్రానికి 2 పర్యాటక ప్రాజెక్టులు!

రాష్ట్రానికి కేంద్రం నుంచి రెండు పర్యాటక ప్రాజెక్టులు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి ఐదింటిని ప్రతిపాదించగా రెండు ప్రాజెక్టులు తుది పరిశీలనలో ఉన్నాయి.

Published : 01 Mar 2024 05:12 IST

సాగర్‌లో బుద్ధవనం, బాన్సువాడలో కల్కి చెరువు
అయిదు ప్రతిపాదనలు.. కేంద్రం తుది పరిశీలనలో రెండు
భువనగిరి ఖిల్లా సమగ్ర ప్రాజెక్టు నివేదికకు ఆమోదం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రానికి కేంద్రం నుంచి రెండు పర్యాటక ప్రాజెక్టులు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి ఐదింటిని ప్రతిపాదించగా రెండు ప్రాజెక్టులు తుది పరిశీలనలో ఉన్నాయి. వీటికి సూత్రప్రాయంగా ఆమోదం లభించిందని త్వరలోనే ప్రకటన వస్తుందని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ వర్గాలు తెలిపాయి. కల్చర్‌-హెరిటేజ్‌ గమ్యస్థానాల్లో నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం, ప్రకృతి పర్యాటకం గమ్యస్థానాల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని కల్కి చెరువు షార్ట్‌లిస్టులో ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భువనగిరి కోటకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రూపొందించి పంపింది. కల్చర్‌-హెరిటేజ్‌, ఆధ్యాత్మికం, ఆకర్షించే గ్రామాలు, ప్రకృతి పర్యాటకం ఈ నాలుగు విభాగాలకు రాష్ట్రాల నుంచి వెళ్లిన పలు ప్రతిపాదనలను కేంద్రం ఇటీవల పరిశీలించి తుది జాబితా రూపొందించింది. రాష్ట్రం నుంచి వికారాబాద్‌, హైదరాబాద్‌, కామారెడ్డి, నల్గొండ, నాగర్‌కర్నూల్‌ అయిదు జిల్లాల నుంచి వివిధ విభాగాల్లో అయిదు ప్రతిపాదనలు వెళ్లాయి.

ఏడాది పొడవునా జల పర్యాటకానికి

బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో ఏడాదంతా నీళ్లుంటాయి. ఎప్పుడైనా నీళ్లు తగ్గితే నిజాంసాగర్‌ కాలువ నుంచి నీళ్లు తీసుకుంటారు. చెరువులో పర్యాటకులు షికారు చేసేలా ఏడాది పొడవునా బోటింగ్‌కు అనువుగా ఉంటుందని టూరిజం కార్పొరేషన్‌ గుర్తించింది. కేంద్రం నుంచి వచ్చే నిధులతో బోటింగ్‌తో పాటు పర్యాటకులకు అవసరమైన సదుపాయాల్ని కల్పించే అవకాశం ఉంది.

బుద్ధవనం.. విదేశీ పర్యాటకులు

నాగార్జునసాగర్‌లో బౌద్ధక్షేత్రంగా విరాజిల్లుతున్న బుద్ధవనం ప్రాజెక్టు రెండేళ్ల క్రితం పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. కృష్ణమ్మ ఒడ్డున, ఎత్తైన కొండల పక్కన ఆధ్యాత్మికతకు తోడు ప్రకృతి సౌందర్యం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. 274 ఎకరాల్లో ఉన్న బుద్ధవనంలో అంతర్గత రహదారులు, పర్యాటకులకు వసతులలేమి వంటి సమస్యలున్నాయి. కేంద్రం నుంచి మంజూరయ్యే కొత్త ప్రాజెక్టులో ఈ సదుపాయాల్ని కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు.

భువనగిరి కోటకు రూ.68.28 కోట్లు

హైదరాబాద్‌కు దాదాపు 45 కి.మీ. దూరంలో ఉన్న ఏక శిల..రాతి గుట్టపై కట్టిన ప్రాచీన కట్టడం భువనగిరి కోట. ప్రస్తుతం మెట్ల దారి ఉండటంతో ఖిల్లాపైకి సులభంగా చేరేందుకు 900 మీటర్ల మేర రోప్‌వేను రూ.15.19 కోట్లతో ఏర్పాటుచేయనున్నారు. రూ.12.18 కోట్లతో సౌండ్‌ అండ్‌ లైట్‌షో, రూ.10.73 కోట్లతో పార్కింగ్‌, రహదారి, రూ.6.07 కోట్లతో సదుపాయాల మెరుగు.. సహా మొత్తం రూ.68.28 కోట్ల కేంద్ర నిధుల్ని ఖర్చు చేయనున్నారు.


పర్యాటకం పెరిగేందుకు దోహదం

తాజా ప్రాజెక్టులు రాష్ట్రంలో పర్యాటకం పెరిగేందుకు దోహదం చేస్తాయి. కేంద్రం నుంచి బుద్ధవనంకు రూ.25 కోట్లు, కల్కి చెరువు రూ.10 కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉంది. భువనగిరి కోటకు రూ.68.28 కోట్లతో రూపొందించిన డీపీఆర్‌ను కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించింది.

కె.రమేష్‌నాయుడు, టూరిజం కార్పొరేషన్‌ ఎండీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని