తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పనేలేదు

‘‘నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తుమ్మిడిహెట్టి వద్ద చేపట్టిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఎక్కడా చెప్పలేదు.

Published : 01 Mar 2024 05:12 IST

కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు నిరర్థకం
కేటీఆర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవాల నిరూపణకు సిద్ధం
నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్‌   ఛైర్మన్‌ వెదిరె శ్రీరామ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తుమ్మిడిహెట్టి వద్ద చేపట్టిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఎక్కడా చెప్పలేదు. 165 టీఎంసీల లభ్యత ఉంది. కానీ 67 టీఎంసీలే ఉన్నట్లు భారాస ప్రభుత్వం దుష్ప్రచారం చేసి పునరాకృతితో మేడిగడ్డ వద్ద కాళేశ్వరం చేపట్టింది. నిర్మాణం కోసం సొంతంగా డిజైన్లు రూపొందించుకుంది. వాటిని సీడబ్ల్యూసీ ఆమోదించలేదు’’ అని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు, నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ వెదిరె శ్రీరామ్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలను ఆయన మీడియాకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. భారాస నేత, మాజీ మంత్రి  కేటీఆర్‌ వ్యాఖ్యలుగా విలేకరులు పలు అంశాలను ప్రస్తావించగా స్పందిస్తూ.. కాళేశ్వరం మూడో టీఎంసీ పనుల్లో ప్రాజెక్టు ఖర్చుకు, వచ్చే ప్రయోజనానికి నిష్పత్తిని ఎక్కువగా చూపారని, దీనిని నిరూపించేందుకు సిద్ధమని శ్రీరామ్‌ స్పష్టం చేశారు. తాను భువనగిరి ఎంపీ సీటుకు ప్రయత్నాలు చేస్తున్నాననేది వ్యక్తిగతమని, ఆ విషయం పార్టీ చూసుకుంటుందని అన్నారు.

కేంద్ర సహకారాన్నీ కోరలేదు...

‘‘ప్రాణహితపై 152 మీటర్ల స్థాయిలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి 165 టీఎంసీలను మళ్లించాలని 2004-2014 మధ్య కాంగ్రెస్‌ ప్రాజెక్టును చేపట్టింది. 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టుకు మరోవైపు ఉన్న మహారాష్ట్రను ముంపు విషయంలో (3,665 ఎకరాలు) ఒప్పించలేదు. ఆయకట్టు లేకున్నా కేవలం కాలువల పనులకు రూ.11,917 కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు ఇది. మహారాష్ట్ర 148 మీటర్ల వద్ద నిర్మించుకోవాలని సూచించినా పదేళ్ల కాలంలో అంగీకారానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. 2014 తరువాత భారాస ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రాన్ని ఒప్పించలేకపోయింది. కనీసం కేంద్ర సహకారం కూడా అడగలేదు.

అనుమతులు లేని ప్రాజెక్టుకు రుణాలు నిలిపివేయాలని లేఖలు రాసిన కేంద్రం

కాళేశ్వరం ప్రాజెక్టును రోజుకు రెండు టీఎంసీల చొప్పున 96 రోజుల్లో 195 టీఎంసీల వరద నీటిని మళ్లించేందుకు చేపట్టారు. 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇస్తామన్నారు. అదే వరద నీటిని రోజుకు మూడు టీఎంసీల చొప్పున 65 రోజుల్లో మళ్లించుకుంటామని మూడో టీఎంసీ పనులు చేపట్టారు. దీనివల్ల అదనంగా రూ.30 వేల కోట్ల వ్యయం పెరిగింది. ఆయకట్టు ఒక్క ఎకరా పెరగలేదు. అనుమతులు లేని ప్రాజెక్టు కావడంతో రూ.28 వేల కోట్ల రుణాలు నిలిపివేయాలని కేంద్రం బ్యాంకులకు లేఖలు రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తాగునీటి సెస్‌, సాగు నీటి పన్నులు వసూలు అవుతాయని డీపీఆర్‌లో పేర్కొని బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నారు.

  • మేడిగడ్డ విషయంలో కేంద్రం పట్టించుకోలేదనేది అవాస్తవం. 2023 అక్టోబరు 21న కుంగితే 25లోపు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 20 రకాల డేటా ఇవ్వాలని రాష్ట్రాన్ని కోరినా అసమగ్ర సమాచారం ఇచ్చారు. ఇప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వమూ ఈనాటికీ ఆ డేటా అందజేయలేదు. ఇటీవల లేఖ రాశాం.
  • మేడిగడ్డ బ్యారేజీలో అన్ని రకాల లోపాలు ఉన్నట్లు అధ్యయనం సందర్భంగా ఎన్‌డీఎస్‌ఏ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు బ్యారేజీ నిర్మాణంలో జియోలాజికల్‌ ఫ్రొఫైల్‌ను తనిఖీ చేయాల్సి ఉంది.
  • అన్నారంలోనూ నీటిని నిలిపి ఎత్తిపోయొచ్చని భారాస నాయకులు అంటున్నారు. ఇప్పటికే లీకేజీలు బయటపడ్డాయి. నీటిని నింపితే ఒత్తిడితో మరింత నష్టం జరుగుతుంది.
  • కాళేశ్వరం ఎత్తిపోతలకు ప్రత్యామ్నాయంగా నదుల అనుసంధానంలో నిర్మించే ఇచ్చంపల్లి నుంచి వెనుక నీటిని తీసుకోవచ్చు. లేదా 100 టీఎంసీలతో మరొక బ్యారేజీ నిర్మాణానికి కూడా అవకాశం ఉంది.
  • 2004లో చేపట్టిన దేవాదులలో డిజైన్‌ లోపాలు ఉన్నాయి. ఈ ఎత్తిపోతల కిందే నాకు అయిదు ఎకరాలు ఉన్నా చుక్కనీరు రావడం లేదు.

గందరగోళం సృష్టిస్తున్న భారాస, కాంగ్రెస్‌

కృష్ణా, గోదావరి బోర్డులు రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన సంస్థలు. నాటీ యూపీఏ ప్రభుత్వమే చట్టం చేసింది. ఆ చట్టంలో రాసిందే మేం అమలు చేస్తున్నాం. రాష్ట్ర విభజన చట్టంలో సాగర్‌, శ్రీశైలం విద్యుత్‌ కేంద్రాలు భౌగోళికంగా ఏ రాష్ట్రం పరిధిలో ఉంటే ఆ రాష్ట్రం నిర్వహించుకోవాలని రాశారు. బోర్డుల ఏర్పాటుకు సంబంధించిన చట్టంలో అన్ని కాంపొనెంట్లు బోర్డు చూస్తుందని రాశారు. ఇదిలాఉంటే మీ నిర్వాకంతోనే కేంద్రం పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్లాయంటూ భారాస, కాంగ్రెస్‌ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ గందరగోళం సృష్టిస్తున్నాయి. ట్రైబ్యునల్‌ చేసిన నీటి వాటాల పర్యవేక్షణ మాత్రమే బోర్డు బాధ్యతని తెలిసినా ఇలా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నా 2015లో కృష్ణా జలాల పంపకం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 299 టీఎంసీలే ఎందుకు అడిగింది? 2020 నుంచి మాత్రమే 50 శాతం చొప్పున పంపిణీకి డిమాండ్‌ చేస్తోంది. తెలంగాణ హక్కుల పరిరక్షణకే నదీ జలాల పంపిణీకి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌-2కు విధివిధానాలు ఖరారు చేసింది. వీలైనంత త్వరగా మొత్తం నివేదిక ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. శ్రీశైలం, సాగర్‌ డ్యాంలు ప్రమాదంలో ఉన్నాయని ఇటీవల ఎన్‌డీఎస్‌ఏ గుర్తించింది. వెంటనే మరమ్మతులు చేపట్టాలి’’ అని వెదిరె శ్రీరామ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని