11,062 పోస్టులతో మెగా డీఎస్సీ.. 4 నుంచి దరఖాస్తులు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ జారీ అయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం తన నివాసంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

Published : 01 Mar 2024 05:13 IST

పరీక్షల తేదీ త్వరలో వెల్లడి
ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహణ
నోటిఫికేషన్‌ విడుదల
పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ జారీ అయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం తన నివాసంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీని ద్వారా మొత్తం 11,062 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్షల తేదీలను త్వరలోనే తెలియజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

పోస్టులు ఇవి

గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటనను రద్దు చేసిన విద్యాశాఖ, తాజాగా అదనపు పోస్టులను జత చేస్తూ 11,062 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 2,629 కాగా, 727 భాషా పండితులు, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ, ప్రత్యేక కేటగిరీ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 220, ఎస్జీటీ 796 ఉన్నాయి. అభ్యర్థులు మార్చి 4వ తేదీ నుంచి (https://schooledu.telangana.gov.in) వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. ఒక పోస్టుకు దరఖాస్తు రుసుము రూ.1,000గా నిర్ణయించింది. ఇతర కేటగిరీల పోస్టులకు విడిగా దరఖాస్తు చేస్తే వాటికి రూ.వేయి చొప్పున రుసుము చెల్లించాలి. 2023 జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి 46 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. గత డీఎస్సీలోని పాతపోస్టులకు కొత్తగా ఖాళీలను జతచేస్తూ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసినందున పాత అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

11 చోట్ల పరీక్ష కేంద్రాలు

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) విధానంలో జరిగే పరీక్షలను మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. జిల్లాలను ప్రాధాన్య క్రమంలో అభ్యర్థులు దరఖాస్తుల్లో పేర్కొనాలని, వాటి సామర్థ్యం, అందుబాటులో ఉన్న వాటిని బట్టి కేంద్రాలను కేటాయిస్తామని పేర్కొంది.

వేర్వేరు తేదీల్లో పరీక్ష

గతేడాది విడుదల చేసిన డీఎస్సీకి 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వాటినీ పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. మొత్తం 10 రోజులపాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతోపాటు స్కూల్‌ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్‌ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో వేర్వేరు తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీకి సీఎం ఆదేశాలు

సాధ్యమైనంత త్వరగా మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల అనంతరం ఆయన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఇతర అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వేగంగా ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్‌ జారీ చేశారని వారిని ఆయన అభినందించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. నిరుద్యోగులు డీఎస్సీపై భారీగా ఆశలు పెట్టుకున్నారని వాటిని సాకారం చేద్దామని తెలిపారు. ప్రతి పాఠశాలకు ఉపాధ్యాయులు, ప్రతి తరగతికి 35 మందికి పైగా విద్యార్థులే లక్ష్యంగా విద్యాశాఖ పనిచేయాలని సూచించారు. బుర్రా వెంకటేశం మాట్లాడుతూ పరీక్షల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని, దరఖాస్తుల నమోదు, ప్రశ్నపత్రాల తయారీ ఫలితాల వరకూ సాంకేతికతను ఉపయోగిస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్‌లో అత్యధికం.. పెద్దపల్లిలో అతి తక్కువ

జిల్లాలవారీగా చూస్తే హైదరాబాద్‌లో అత్యధికంగా 878 డీఎస్సీ పోస్టులు భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా పెద్దపల్లిలో 93 మాత్రమే ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు గరిష్ఠంగా ఖమ్మం జిల్లాలో 176 ఉండగా.. కనిష్ఠంగా మేడ్చల్‌లో 26 పోస్టులు ఉన్నాయి. ఇక ఎస్జీటీ పోస్టుల విషయానికి వస్తే అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 537, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 21 ఖాళీలు భర్తీ చేయనున్నారు.


ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 4.3.2024.
  • చివరితేదీ: 2.4.2024.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని