ధరణి అర్జీలకు మోక్షం!

ధరణిలోని అపరిష్కృత దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతోపాటు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

Updated : 01 Mar 2024 12:41 IST

నేటి నుంచి పెండింగ్‌ దరఖాస్తులపై స్పెషల్‌ డ్రైవ్‌
మార్చి 9 వరకు అన్నింటి పరిష్కారం
ఒక్కో మండలంలో రెండు లేదా మూడు బృందాల ఏర్పాటు
మండల స్థాయిలో విచారణ.. అవసరమైతే క్షేత్రస్థాయికి బృందాలు
జిల్లా కలెక్టర్ల అధికారాల విభజన
ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన సీసీఎల్‌ఏ

ఈనాడు, హైదరాబాద్‌: ధరణిలోని అపరిష్కృత దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతోపాటు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం (మార్చి 1) నుంచి తొమ్మిదో తేదీలోపు పెండింగ్‌ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనుంది. ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఇటీవల ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు కొన్ని సిఫార్సులను అందజేసింది. ఈ నేపథ్యంలో గురువారం రెండు వేర్వేరు ఉత్తర్వులను భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) నవీన్‌ మిత్తల్‌ జారీ చేశారు. అన్ని స్థాయుల్లో విచారణలు, దస్త్రాల పరిశీలన చేపట్టాలని, వాటి వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను కూడా భూ యజమానులకు తెలియజేయాలని స్పష్టం చేశారు.ధరణి సమస్యల పరిష్కారానికి తహసీల్దారు కార్యాలయాల పరిధిలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలో రెండు లేదా మూడు బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణలు జరిపి.. విచారణ నివేదికలను సంబంధిత ఉన్నతాధికారులకు పంపిస్తారు. పారాలీగల్‌, కమ్యూనిటీ సర్వేయర్లు, డీఆర్‌డీఏ, వ్యవసాయశాఖ విస్తరణ అధికారులు, పంచాయతీల కార్యదర్శులను ఈ బృందాల్లో నియమిస్తారు. గ్రామాలు లేదా మాడ్యూళ్ల వారీగా దరఖాస్తులను ఈ బృందాలకు తహసీల్దార్లు అప్పగించి.. విచారణ నివేదికలు రూపొందిస్తారు. వాటిని సంబంధిత ఉన్నతాధికారులకు పంపుతారు. దరఖాస్తుదారులకు గ్రామస్థాయి అధికారుల ద్వారా లేదా వాట్సప్‌, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో బృందాలు సమాచారం చేరవేస్తాయి. దరఖాస్తుదారుల వద్ద ఉన్న ఆధారాలతోపాటు రెవెన్యూ మూల దస్త్రాలను బృందాలు పరిశీలించాల్సి ఉంటుంది. అవసరమైతే భూమిని కూడా పరిశీలిస్తారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించి విచారణ నిర్వహించి.. పరిష్కారం లేదా తిరస్కరణలలో ఏదో ఒకటి నమోదు చేస్తారు. ఈ నెల 9వ తేదీ నాటికి ప్రతి దరఖాస్తును పరిష్కరించేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కలెక్టర్ల వద్ద ఒక్క దరఖాస్తు కూడా మిగిలి ఉండటానికి వీల్లేదని ఉత్తర్వుల్లో సీసీఎల్‌ఏ పేర్కొన్నారు.

తహసీల్దార్ల స్థాయిలో..

నాలుగు రకాల మాడ్యూళ్లకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దారు పరిష్కరిస్తారు. సేత్వార్‌, ఖాస్రా పహాణీ, ఇతర మూల పత్రాలను పరిశీలించి క్షేత్రస్థాయి విచారణలు జోడించి.. సమస్యలను పరిష్కరిస్తారు.

టీఎం-4: ఎసైన్డ్‌ భూములతోపాటు అన్ని రకాల వారసత్వ బదిలీ ప్రక్రియలు (పాసుపుస్తకాలు కూడా)
టీఎం-10: జీపీఏ/ఎస్‌పీఏ/ఎగ్జిక్యూటెడ్‌ జీపీఏ దరఖాస్తులు
టీఎం-14: భూ సమస్యలకు సంబంధించిన వినతులు
టీఎం-32: రెండు, మూడు ఖాతాలు నమోదై ఉంటే కలపడం

ఆర్డీవో స్థాయిలో..

ఆరు రకాల మాడ్యూళ్లలో వచ్చిన దరఖాస్తులను ఆర్డీవోలు పరిష్కరిస్తారు. దరఖాస్తులను తప్పనిసరిగా తహసీల్దార్లకు పంపించి.. విచారణ నివేదిక తెప్పించుకోవాల్సి ఉంటుంది.
టీఎం-7: పాసుపుస్తకాలు లేకుండా వ్యవసాయేతర భూములుగా నమోదైనవి
టీఎం-16: భూ సేకరణకు సంబంధించిన సమస్యలు
టీఎం-20: ప్రవాసీయులకు చెందిన భూ సమస్యలు
టీఎం-22: సంస్థల పేరుతో పాసుపుస్తకాలు
టీఎం-26: కోర్టు కేసులు, సమాచారం
టీఎం-33: పాసుపుస్తకాల్లో తప్పులు నమోదైనవి

మూల విలువ రూ.5 లక్షల్లోపు ఉన్న భూములకు సంబంధించిన మిస్సింగ్‌ సర్వే నంబర్లు/సబ్‌ డివిజన్‌ సర్వే నంబర్లు/విస్తీర్ణాల్లో హెచ్చుతగ్గులకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరిస్తారు.(రెవెన్యూ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ ప్రకారం)

కలెక్టర్ల పరిధిలో..

ఆర్డీవోల విచారణ అనంతరం ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల సమస్యలను జిల్లా కలెక్టర్లు పరిష్కరిస్తారు. క్షేత్రస్థాయి సిబ్బంది విచారణ నిర్వహించి ఆర్డీవోలకు నివేదికలు ఇవ్వాలి. ఆర్డీవోలు తప్పనిసరిగా రెవెన్యూ మూల దస్త్రాల పరిశీలన చేపట్టాలి. తిరస్కరించే దరఖాస్తులకు సరైన కారణాన్ని కలెక్టర్లు తెలియజేయాలి. ఏడు రకాల మాడ్యూళ్లకు సంబంధించి కలెక్టర్లే తుది ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తహసీల్దార్లు, ఆర్డీవోల స్థాయిలో విచారణలు చేసిన అనంతరమే వీరు చర్యలు తీసుకోవాలి.

టీఎం-3: యాజమాన్య హక్కుల బదిలీ(మ్యుటేషన్‌)
టీఎం-4: ఎసైన్డ్‌ భూములతోపాటు వారసత్వ బదిలీకి సంబంధించి పాసుపుస్తకాలు లేనివి
టీఎం-15: నిషేధిత జాబితాలోని భూములకు సంబంధించిన దరఖాస్తులు
టీఎం-23: సెమీ అర్బన్‌ భూములు
టీఎం-24: కోర్టు కేసులు-పాసుపుస్తకాలు
టీఎం-31: ఇళ్లు/ఇంటి స్థలాలకు వ్యవసాయేతర భూములుగా మార్పిడి
టీఎం-33: పాసుపుస్తకాల్లో సవరణలు, పేరు, ధరణికి ముందు కొంత భూమిని చదరపు గజాల లెక్కన విక్రయించినవి. వ్యవసాయ భూమిగా వ్యవసాయేతర భూమి మార్పు. మిస్సింగ్‌ సర్వే నంబర్లు, సబ్‌ డివిజన్‌ నంబర్లు

మూల విలువ రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉన్న భూమికి సంబంధించి విస్తీర్ణంలో సవరణలు (రెవెన్యూ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ ప్రకారం)

సీసీఎల్‌ఏ స్థాయిలో..

టీఎం-33 మాడ్యూల్‌కు సంబంధించి అన్ని రకాల పాసుపుస్తకాల సవరణలను సీసీఎల్‌ఏ చేపడతారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన ఖాతాల నుంచి పట్టా భూముల బదిలీ, భూమి స్వభావం మార్పు, మూల విలువ రూ.50 లక్షల కన్నా అధికంగా ఉండే భూముల విస్తీర్ణాలకు సంబంధించి సవరణలు, మిస్సింగ్‌ సర్వే/సబ్‌ డివిజన్‌ తదితర సవరణలు చేపడతారు. అన్నిరకాల దరఖాస్తులను తహసీల్దార్లకు పంపించి.. విచారణ చేయిస్తారు. తహసీల్దారు ఆర్డీవోకు, అక్కడి నుంచి అదనపు కలెక్టర్‌కు పంపుతారు. అక్కడ పరిశీలన పూర్తయ్యాక కలెక్టర్‌కు పంపుతారు. అక్కడి నుంచి సీసీఎల్‌ఏకు నివేదిక చేరుతుంది.


నిర్దిష్ట సమయంలో పరిష్కారం

2020 అక్టోబరు నుంచి అమల్లోకి వచ్చిన జిల్లా కలెక్టర్ల అధికారాలను విభజించి.. వాటిలో కొన్నింటిని తహసీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం కట్టబెట్టింది. సమస్యలకు పరిష్కారం చూపేందుకు నిర్దిష్ట సమయాన్ని సైతం నిర్దేశించింది. ప్రభుత్వ భూములను సంరక్షిస్తూనే భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించింది. పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు సూచించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని