గ్రేటర్‌ సిటీ కార్పొరేషన్‌!

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను.. హైదరాబాద్‌ గ్రేటర్‌ సిటీ కార్పొరేషన్‌గా ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది.

Published : 02 Mar 2024 05:12 IST

రాజధాని పరిధిలోని ఏడు కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల విలీనానికి కసరత్తు
సమాన జనాభా ఉండేలా డివిజన్ల పునర్విభజన
అధ్యయనం చేయాలని మున్సిపల్‌ శాఖకు సీఎం రేవంత్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను.. హైదరాబాద్‌ గ్రేటర్‌ సిటీ కార్పొరేషన్‌గా ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. రాష్ట్ర రాజధాని శివారున ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థగా విలీనం చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ) పరిధిలో ఉన్న 7 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను హైదరాబాద్‌ కార్పొరేషన్‌లో విలీనంపై కసరత్తు చేయాలని సీఎం అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆదేశించారు. ఏకరూపంలో అభివృద్ధి చేసేందుకు విలీనం ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో 150 డివిజన్లు ఉన్నాయి. జనాభా కోటికిపైగా ఉంది. ఏడు కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల్లో సుమారు 60 లక్షల వరకు జనాభా ఉంటుందని అంచనా. విలీనం చేస్తే జనాభా 1.80 కోట్ల నుంచి 2 కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుందని అంచనా. విలీన ప్రాంతాలన్నింటినీ గ్రేటర్‌ సిటీ కార్పొరేషన్‌గా ఒకటిగా ఏర్పాటు చేయాలా? లేక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణం వేర్వేరుగా నాలుగు సిటీ కార్పొరేషన్లుగా విభజించాలా? అన్న అంశాన్ని అధ్యయనం చేయాలని రేవంత్‌ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ రింగు రోడ్డు వరకు హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించాలని సీఎం ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఏడాది తర్వాతే ప్రత్యేకాధికారులు!

విలీనం ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారు మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తరవాత ప్రత్యేక అధికారులను నియమించే అంశంపై సీఎం ఇప్పటికే అధికారులతో సమాలోచనలు చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు బోడుప్పల్‌, పీర్జాదిగూడ, జవహర్‌నగర్‌, బండ్లగూడ జాగీర్‌, నిజాంపేట, బడంగ్‌పేట, మీర్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లు ఉన్నాయి. వాటితో పాటు 30 మున్సిపాలిటీలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. వాటి పాలకవర్గాల పదవీకాలం మరో ఏడాది ఉంది. ఆ తర్వాతే ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయించారు.

ఏకరూప అభివృద్ధి

ప్రస్తుతం కొన్ని డివిజన్లలో లక్ష మందికిపైగా జనాభా ఉంటే, మరికొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో 30 వేల మంది మాత్రమే ఉన్నారు. నిధుల కేటాయింపులో సమతౌల్యం లోపించిందన్న అభిప్రాయం ఉంది. మౌలిక వసతుల కల్పనకు నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే ఆయా ప్రాంతాల అభివృద్ధి ఏకరూపంలో సాగడానికి అవకాశం ఉంటుందని అధికారుల అంచనా. నగర విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు తదితరాల కోసం భారీగా నిధులు వెచ్చించాలని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నూతనంగా ఏర్పాటు చేసే కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయాలని.. దీనిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దేశ రాజధాని దిల్లీలో రెండేళ్ల కిందట అక్కడి మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్‌గా విలీనం చేసింది. ఇందుకు అనుసరించిన విధానాలను రేవంత్‌ మున్సిపల్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని