త్వరలో రైతు, విద్యా కమిషన్లు

త్వరలోనే రాష్ట్రంలో రైతు, విద్యా కమిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Published : 02 Mar 2024 05:12 IST

కౌలు రైతుల రక్షణపై అఖిలపక్ష సమావేశం
పౌర సమాజం ప్రతినిధులతో సీఎం

ఈనాడు, హైదరాబాద్‌: త్వరలోనే రాష్ట్రంలో రైతు, విద్యా కమిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో విద్యా కమిషన్‌ నిర్ణయిస్తుందన్నారు. రైతులు, కౌలు రైతుల సాధక బాధకాలు, వాళ్ల సంక్షేమం, వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్‌ తగిన సలహాలు, సూచనలు అందిస్తుందన్నారు. శుక్రవారం సచివాలయంలో వివిధ సామాజిక సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ మహేశ్‌గౌడ్‌, కోదండరాం, హరగోపాల్‌, విశ్వేశ్వర్‌రావు, రియాజ్‌, పురుషోత్తం, యోగేంద్రయాదవ్‌, రమ మెల్కోటే, గాదె ఇన్నయ్య, కిరణ్‌ విస్సా, కవిత గురుకంటి, ఆయేషా రుబీనా, నవీన్‌, రవి కన్నెకంటి తదితరులు ఉన్నారు.

సంక్షేమ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నాం

ముఖ్యమంత్రి రేవంత్‌ మాట్లాడుతూ.. ‘‘అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టింది. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌ను తెరిపించాం. ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రజాభవన్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ప్రజాపాలన కార్యక్రమంలో సంక్షేమ పథకాలకు దరఖాస్తులను స్వీకరించాం. రాష్ట్ర ఆర్థిక, విద్యుత్‌, సాగునీటి రంగ పరిస్థితులపై పూర్తి వివరాలతో అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేశాం. మహిళలు, నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా.. ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేశాం. రైతులు, నిరుద్యోగులకు మేలు చేసేందుకు మరిన్ని చర్యలు చేపడతాం.

రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి?

కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. అందరి సూచనలు, సలహాలు తీసుకుంటాం. వాటి ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని ఆలోచిస్తున్నాం. రైతు భరోసా అనేది  రైతులకు పెట్టుబడి సాయంగా అందించేది. అలాంటి రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలి. నిస్సహాయులకు, నిజమైన అర్హులకు అవసరమైతే చెప్పిన దానికంటే ఎక్కువ సాయం చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. రాష్ట్రంలో పంట మార్పిడి పథకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముంది. అన్ని పంటలు విస్తరించేలా రైతులు సరికొత్త విధానాలను అనుసరించాలి.

సమీకృత విద్యాలయాలు 

రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాలయాలను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను వేర్వేరు చోట్ల కాకుండా, దాదాపు 25 ఎకరాల్లో ఒకేచోట సమీకృత ప్రాంగణాల్లో ఏర్పాటు చేస్తాం. పైలట్‌ ప్రాజెక్టుగా ముందు కొడంగల్‌లో ఇంటిగ్రేటెడ్‌ క్యాంపస్‌ నెలకొల్పుతాం. దశల వారీగా అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తాం. దీంతో కుల, మత వివక్ష తొలగిపోతుంది. విద్యార్థుల్లో ప్రతిభతో పాటు పోటీతత్వం పెరుగుతుంది. గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత సమర్థంగా జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు మా ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోంది. గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి, ఉద్యోగాలను భర్తీ చేశాం. గ్రూప్‌ 1, మెగా డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. యూపీఎస్‌సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాలు చేపడతాం’’ అని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని