ఎలివేటెడ్‌ కారిడార్లకు పచ్చజెండా

సికింద్రాబాద్‌ నుంచి కంటోన్మెంట్‌ ప్రాంతం మీదుగా రామగుండం, నాగ్‌పుర్‌ జాతీయ రహదారుల వైపు ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది.

Published : 02 Mar 2024 05:11 IST

కంటోన్మెంట్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ కష్టాలకు చెల్లు
భూములిచ్చేందుకు రక్షణశాఖ అంగీకరించడంపై సీఎం రేవంత్‌ హర్షం

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి కంటోన్మెంట్‌ ప్రాంతం మీదుగా రామగుండం, నాగ్‌పుర్‌ జాతీయ రహదారుల వైపు ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. సైనిక స్థావరాల మీదుగా వెళ్లాల్సిన పైవంతెనల నిర్మాణానికి రక్షణ శాఖ అంగీకరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్నో ఏళ్లుగా ఇరుకైన రోడ్లతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులను, రక్షణశాఖతో ముడిపడిన భూసమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఏడాది జనవరి 5న రక్షణశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారని, పైవంతెనల నిర్మాణంతో ముడిపడిన సమస్యలపై లేఖను అందజేయడంతో సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభించినట్లు సీఎంవో పేర్కొంది. ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రధాని మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఫలించిన నిరీక్షణ

హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌, రామగుండంను కలిపే రాజీవ్‌ రహదారిపై 11.3 కి.మీ పొడవునా, ఆరు వరుసల వెడల్పుతో నిర్మితమయ్యే ఎలివేటెడ్‌ కారిడార్‌ (పొడవైన పైవంతెన)కు పెద్దఎత్తున భూసేకరణ అవసరమైంది. ఈ నిర్మాణం పరేడ్‌ మైదానంలోని వీర సైనికుల స్మారక స్తూపం నుంచి కార్ఖానా, తిరుమలగిరి, హకీంపేట్‌ మీదుగా ఓఆర్‌ఆర్‌ వరకు సాగనుంది. మధ్యలో 83 ఎకరాల భూమి అవసరం. 44వ జాతీయ రహదారిపై ప్యారడైజ్‌ కూడలి కండ్లకోయ మధ్య 18.30 కి.మీ. పొడవునా 6 వరుసల వెడల్పుతో పైవంతెనల మార్గాన్ని నిర్మించాలన్నది ప్రతిపాదన. అందులో 12.68 కి.మీ. ఎలివేటెడ్‌ కారిడార్‌ ఉంటుంది. దానికి 4 ప్రాంతాల్లో ఎగ్జిట్‌, ఎంట్రీ ర్యాంపులుంటాయి. భవిష్యత్తులో ఆ నిర్మాణం పొడవునా డబుల్‌ డెక్కర్‌ మెట్రోరైలు మార్గం నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్లు రూపుదిద్దుకున్నాయి. వాటన్నింటికీ కలిపి 56 ఎకరాల భూమి అవసరమనేది రెండో ప్రతిపాదన. ఈ నిర్మాణాలకు కావాల్సిన భూమిలో మెజార్టీ రక్షణశాఖ ఆస్తులుండటంతో భూసేకరణకు అంగీకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి రక్షణశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం కేంద్రంతో అనుసరించిన అహంకారపూరిత వైఖరితో రక్షణశాఖ భూ సమస్య ఎనిమిదేళ్లుగా పరిష్కారం కాలేదని సీఎం విమర్శించారు. తమ ప్రభుత్వం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించినట్లు గుర్తుచేశారు. పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా రాష్ట్రం కోసం కేంద్రంతో స్నేహసంబంధాలను కొనసాగిస్తామన్నారు. త్వరలోనే ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.

మంత్రి పొన్నం హర్షం

ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి కేంద్ర రక్షణశాఖ అనుమతివ్వడంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రక్షణశాఖ ప్రాంతంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ లేకపోవడంతో ట్రాఫిక్‌పరంగా ఇబ్బందులున్నాయంటూ తాను సీఎం రేవంత్‌రెడ్డికి డిసెంబరు 15న లేఖ రాసినట్లు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాయడంతో తాజా అనుమతి వచ్చిందన్నారు.


స్కైవేల నిర్మాణానికి రక్షణశాఖ ఆమోదం

కంటోన్మెంట్‌లోని ఎన్‌హెచ్‌-44, రాజీవ్‌ రహదారిలో స్కైవేల నిర్మాణానికి కేంద్ర రక్షణశాఖ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి శుక్రవారం కేంద్ర రక్షణశాఖ నుంచి ఉత్తర్వులు అందాయని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు సీఈవో మధుకర్‌నాయక్‌ తెలిపారు. త్వరలోనే డీఈవో, హెచ్‌ఎండీఏ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని