విజిలెన్స్‌ నివేదిక ప్రకారం క్రిమినల్‌ కేసులు

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్‌ నివేదిక మేరకు బాధ్యులైనవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Published : 02 Mar 2024 05:11 IST

ఎన్డీఎస్‌ఏ నివేదిక అందగానే మేడిగడ్డ మరమ్మతు చేసి నీళ్లు ఇస్తాం
భారాస పాపాల్లో భాజపాకూ పాత్ర: మంత్రి ఉత్తమ్‌

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్‌ నివేదిక మేరకు బాధ్యులైనవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. విజిలెన్స్‌ నేడో రేపో మరో నివేదిక ఇవ్వనుందని అనంతరం న్యాయ సలహా తీసుకుని చర్యలు చేపడతామన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీళ్లు ఉన్నాయని సీడబ్ల్యూసీ చెప్పిందని కేంద్ర జలశక్తిశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ గురువారం కుండబద్ధలు కొట్టారు. ఈ ప్రాజెక్టుతో కాంగ్రెస్‌కు పేరొస్తుందని, కమీషన్లు మిగలవని కేసీఆర్‌ కుట్ర చేసి ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారు. నీళ్ల కోసం కాదు. పైసల కోసం కాళేశ్వరం కట్టారు. చంద్రశేఖర్‌ అయ్యర్‌తో కేంద్రం కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. శనివారం దిల్లీకి వెళ్లి కమిటీ, నిపుణులను కలుస్తాను. త్వరగా అధ్యయనం చేసి ఎలా ముందుకు వెళ్లాలనేది సూచించాలని కోరుతాం. ఆ కమిటీ నెల రోజుల్లో ఒక నివేదిక ఇస్తుంది. నాలుగు నెలల్లోనే పూర్తి నివేదిక అందిస్తుంది. నివేదిక రాగానే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు ఇస్తాం. భారాస నాయకులు వాళ్లే విధ్వంసం చేసి ఎదురు ప్రశ్నిస్తున్నారు. మేడిగడ్డను బొందలగడ్డ అన్నవాళ్లు నేడు ఎందుకు వెళ్లారో. కనీసం అక్కడికి వెళ్లైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. భారాస నాయకులు వెళ్లే బస్సు టైర్‌ పేలింది. ఇప్పటికే కారు షెడ్‌కు పోయింది. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) కన్నా కేటీఆర్‌ నిపుణుడేమీ కాదు. కాఫర్‌ డ్యాం కట్టి నీళ్లను మళ్లించొచ్చు అని పనికిమాలిన ఉచిత సలహాలు ఇస్తున్నారు. గతేడాది అక్టోబరు 21న పిల్లర్లు కుంగితే డిసెంబరు 7 వరకు భారాస ప్రభుత్వమే ఉంది. అన్ని రోజులు మాట్లాడని నాటి సీఎం కేసీఆర్‌ ఆ తరువాత నల్గొండ వెళ్లి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అన్నారం, సుందిళ్లలోనూ నీటిని నింపొద్దని ఎన్డీఎస్‌ఏ సూచించింది. డిజైన్లు, జీఐఎస్‌ సర్వే తదితర లోపాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. నాటి ప్రభుత్వం ఒక్క నివేదిక కూడా రూపొందించలేదు. ఎన్డీఎస్‌ఏ అడిగినా ఇవ్వలేదు. మా ప్రభుత్వాన్ని అడిగినా నివేదికలేవీ లేవని స్పష్టంగా చెప్పాం. బ్యారేజీ పూర్తయిందని ఒకటి కన్నా ఎక్కువ నివేదికలను గత ప్రభుత్వంలో ఇచ్చారు’ అని తెలిపారు.

పదే పదే అబద్ధాలు..: మేడిగడ్డ నిర్మాణంలో బ్లాకుల వారీగా నివేదికలు రూపొందించలేదని మంత్రి పేర్కొన్నారు. ‘చాలా నివేదికలు లేవు. వానాకాలం ముందు, తరువాత ప్రవాహ నివేదికలు లేవు. నివేదికలు రూపొందించే విధానంలో ఏదో మతలబు ఉందని విజిలెన్స్‌ అభిప్రాయపడింది. నిర్మాణంలోకక్కుర్తి, అసమర్థత, నిర్లక్ష్యం ఉన్నాయి. కాళేశ్వరం కింద ఐదేళ్లలో 120 టీఎంసీలు ఎత్తిపోసి స్థిరీకరణకు నీళ్లు ఇచ్చామని పదే పదే అబద్ధాలు చెబుతున్నారు. భారాస, భాజపాల మధ్య అలయ్‌ బలయ్‌ లేకపోతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.లక్ష కోట్ల రుణాలు ఎలా అందాయి. భారాస పాపాల్లో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పాత్ర కూడా ఉంది. విద్యుత్‌ ఖర్చు యూనిట్‌కు రూ.6 అయితే రూ.3గా చూపడం, వరి దిగుబడిని మూడింతలుగా చూపి రుణాలు తీసుకొచ్చారు. నిర్మాణ సంస్థ కాకుండా ఉప గుత్తేదారులు ఉన్నట్లు మాకు తెలిసినా దస్త్రాలపరంగా ఎక్కడా కనిపించలేదు. ఎల్‌అండ్‌టీ సంస్థకు రూ.400 కోట్ల బిల్లులు నిలిపివేశాం. కేంద్ర బలగాలు తొలగిస్తే సాగర్‌ నిర్వహణ పూర్తి స్థాయిలో చేపడుతాం. మ్యానిఫెస్టోలో చెప్పినట్లు తుమ్మిడిహెట్టి నిర్మిస్తాం.’ అని మంత్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని