కరెంటు జీరో బిల్లుల ప్రారంభం

గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు కరెంటు వాడే వినియోగదారులకు జీరో బిల్లుల జారీ ప్రారంభమైంది.

Published : 02 Mar 2024 04:10 IST

స్వయంగా రీడింగ్‌ తీసి బిల్లు ఇచ్చిన ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు
200 యూనిట్లలోపు వాడే వినియోగదారులు 39.90 లక్షలని అంచనా

ఈనాడు, హైదరాబాద్‌: గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు కరెంటు వాడే వినియోగదారులకు జీరో బిల్లుల జారీ ప్రారంభమైంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ప్రజల ఇళ్లకు వెళ్లి స్వయంగా మీటరు రీడింగ్‌ తీసి జీరో బిల్లుల జారీ కార్యక్రమాన్ని వేడుకలా ప్రారంభించారు. బిల్లు అందుకున్న ప్రజలతో మాట్లాడి ఈ పథకంపై వారి స్పందనను తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో 200 యూనిట్లలోపు కరెంటు వాడిన వినియోగదారులు 39.90 లక్షల వరకూ ఉండొచ్చని విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల అంచనా. ప్రజాపాలనలో మొత్తం 81 లక్షలకు పైగా కుటుంబాల వారు తమకు గృహజ్యోతి కింద ఉచిత కరెంట్‌ కావాలని దరఖాస్తులిచ్చారు. వాటిని వడపోసిన అధికారులు తొలిదశలో 39.90 లక్షల మంది అర్హులని తేల్చారు. రేషన్‌కార్డు, ఆధార్‌ వివరాలు సేకరించి వినియోగదారుల నమోదు ఇంకా కొనసాగుతున్నందున వచ్చేనెల అర్హుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. 200 యూనిట్లలోపు వాడినా... రేషన్‌కార్డు లేదని బిల్లులు జారీ అవుతున్నవారికి కూడా వివరాలు సమర్పించేందుకు అవకాశమిచ్చినందున వెంటనే వారి నుంచి సొమ్ము వసూలుకు బలవంతపు చర్యలకు దిగవద్దని ప్రభుత్వం ఆదేశించినట్లు డిస్కం అధికారులు చెప్పారు. వారు తమ రేషన్‌కార్డు, ఆధార్‌కార్డుల నకళ్లతో సమీపంలోని విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయం లేదా మండల పరిషత్‌ లేదా మున్సిపల్‌ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వాటిని పరిశీలించి అర్హులైనవారిని జాబితాలో చేరుస్తారని తెలిపారు.

ముదిగొండలో భట్టి...

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని ముదిగొండలో జీరో బిల్లుల జారీ కార్యక్రమాన్ని భట్టి విక్రమార్క ఒక ఇంట్లో మీటరు రీడింగ్‌ను నమోదు చేసి ప్రారంభించారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ, గంగారాం మండలంలో మంత్రి సీతక్క బిల్లులు పంపిణీ చేశారు. వరంగల్‌ నగరంలోని భరత్‌నగర్‌లో మంత్రి కొండా సురేఖ జీరో బిల్లులను వినియోగదారులకు అందజేశారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా గ్యారంటీ హామీలను అమలుచేస్తున్నామని మంత్రులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని