ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ వద్ద రైతుల ఆందోళన

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం వ్యాపారులు మిరప ధరను అమాంతం తగ్గించడంతో రైతులు కోపోద్రిక్తులయ్యారు.

Published : 02 Mar 2024 04:13 IST

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం వ్యాపారులు మిరప ధరను అమాంతం తగ్గించడంతో రైతులు కోపోద్రిక్తులయ్యారు. ఉదయం 7.30 గంటలకు మార్కెట్‌లో జెండా పాట నిర్వహించగా సుమారు 100 మంది ఖరీదుదారులకుగానూ కేవలం ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. క్వింటా గరిష్ఠధర రూ.20,800గా నిర్ణయించారు. మార్కెట్‌కు సుమారు 70వేల బస్తాల సరకు వచ్చింది. వ్యాపారులు క్వింటా ధర రూ.14వేల నుంచి రూ.16వేల వరకే నిర్ణయించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలని నినదించారు. మార్కెట్‌ గేటు ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో మిరప కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అక్కడికి చేరుకుని వ్యాపారులు, రైతులతో సమావేశమై సమస్య పరిష్కరిస్తామని, కొనుగోళ్లకు సహకరించాలని కోరారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత విపణిలో కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం జరిగిన రైతుల ఆందోళనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు.

మార్కెట్లలో గిట్టుబాటు ధరలు రావాలి: మంత్రి తుమ్మల

ఈనాడు, హైదరాబాద్‌: రైతులు తెచ్చే పంట ఉత్పత్తులకు మార్కెట్లలో తప్పనిసరిగా గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెటింగ్‌ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగనీయొద్దని, కావాల్సిన వసతులు కల్పించాలని, పంట ఉత్పత్తుల తరలింపుపైనా అవగాహన కల్పించాలని సూచించారు. ఖమ్మం మార్కెట్‌యార్డులో మిర్చి రైతుల పట్ల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన ఖమ్మం తదితర మార్కెట్‌ యార్డుల్లో మద్దతు ధరల కోసం రైతుల ఆందోళనల సమాచారంపై సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఖమ్మం మిర్చి మార్కెట్‌లో జరిగిన దర్నాపై ఆరా తీశారు. ఇలాంటి సంఘటనల వల్ల మార్కెట్లలో గందరగోళ వాతావరణం తలెత్తుతుందన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని లక్ష్మీబాయిని ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ, ‘‘ఖమ్మం మార్కెట్‌కు శుక్రవారం సుమారు 50 వేల బస్తాల మిర్చి వచ్చిందని, అందులో కొంత మిర్చికి నాణ్యత తక్కువగా, తేమ ఎక్కువగా ఉందని వ్యాపారులు తక్కువ ధరకు కొనబోతే రైతులు దర్నా చేశారని తెలిపారు. మార్కెటింగ్‌ అధికారులు, పోలీస్‌ సిబ్బంది సమక్షంలో రైతులతో, వ్యాపారులతో చర్చించిన అనంతరం మార్కెట్‌ కార్యకలాపాలు కొనసాగాయని ఆమె వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని