9 సున్నపురాయి గనులకు వేలం!

సున్నపురాయి గనులకు సంబంధించి నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని తొమ్మిది క్లస్టర్లను తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) గుర్తించింది.

Updated : 02 Mar 2024 05:40 IST

సిద్ధమవుతున్న ప్రణాళికలు
నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో క్లస్టర్లు
216.82 చ.కి.మీ. విస్తీర్ణంలో గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: సున్నపురాయి గనులకు సంబంధించి నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని తొమ్మిది క్లస్టర్లను తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) గుర్తించింది. వీటిని వేలం వేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు వేలంలో పెట్టే రిజర్వ్‌ ధర కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని గనుల శాఖ నిర్ణయించింది. జీ-4 సర్వే ద్వారా రెండు జిల్లాల్లో కలిపి 216.82 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సున్నపురాయి గనులున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు తొమ్మిది క్లస్టర్ల వేలంపై గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదనలు పంపింది. గతంలో ముందు దరఖాస్తు చేసిన వారికి ముందు గనుల్ని ఇచ్చే విధానం ఉండేది. అయితే అవినీతికి ఆస్కారం ఉండటం, సహజ వనరుల ద్వారా ప్రభుత్వానికి తక్కువ ఆదాయం రావడం వంటి అంశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఖనిజాలకు వేలం విధానాన్ని తీసుకువచ్చింది. సున్నపురాయి గనులు మేజర్‌ మినరల్స్‌ పరిధిలోకి వస్తాయి. ఈ మేరకు తొమ్మిది క్లస్టర్ల ప్రాంతానికి వేలం వేసి కాంపొజిట్‌ లైసెన్స్‌ ఇవ్వాలని రాష్ట్ర గనుల శాఖ నిర్ణయించింది. రిజర్వ్‌ ధరను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేయగానే వేలం ప్రక్రియ ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. అయితే జీ-4 సర్వే ఆధారంగా కాకుండా జీ-3 సర్వే చేశాక సున్నపురాయి గనుల్ని వేలం వేయాలన్న యోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లు సమాచారం. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. జీ-4 సర్వేలో సున్నపురాయి నిక్షేపాలు ఒక ప్రాంతంలో ఎంతమేర ఉన్నాయన్న విషయం తెలుస్తుంది. అక్కడక్కడ బోరుబావిలాగా డ్రిల్లింగ్‌ చేస్తారు. దీనిద్వారా సున్నపురాయి ఖనిజం ఎక్కడెక్కడ ఉంది.. ఎంత లోతు వరకు ఉందన్నది తెలుస్తుంది. అయితే ఇందులో డ్రిల్లింగ్‌ చేసే ప్రాంతాల సంఖ్య తక్కువ ఉంటుంది. అదే జీ-3లో డ్రిల్లింగ్‌ చేసే ప్రాంతాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ విధానంలో ఖనిజ ఫలితాల్లో కచ్చితత్వం అధికంగా ఉంటుంది. అయితే గనుల శాఖ జీ-4 సర్వే ఆధారంగానే కాంపొజిట్‌ లైసెన్స్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మైనింగ్‌ లీజు దక్కించుకున్న సంస్థనే జీ-3 సర్వే చేసుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని