బాబ్లీ నుంచి నీటి విడుదల

నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శుక్రవారం రెండు రాష్ట్రాల అధికారులు తెరిచారు.

Updated : 02 Mar 2024 05:38 IST

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శుక్రవారం రెండు రాష్ట్రాల అధికారులు తెరిచారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా జులై 1న ప్రాజెక్టు గేట్లు ఎత్తి అక్టోబరు 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా తెరిచి ఉంచుతుంది. దీంతోపాటు మార్చి 1న గేట్లను ఎత్తి ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదులుతుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులు సీడబ్ల్యూసీ ఈఈ వెంకటేశ్వర్లు, నాందేడ్‌ జిల్లా ఈఈ బన్‌సోడే, ఎస్పారెస్పీ ఈఈ గణేశ్‌, ఏఈ రవి బాబ్లీ ప్రాజెక్టు వద్దకు చేరుకుని గేట్లను ఎత్తి 0.6 టీఎంసీల నీటిని వదిలారు. దీంతో నిజామాబాద్‌ జిల్లా కందుకుర్తి, నిర్మల్‌ జిల్లా బాసర వద్ద ప్రవాహం స్వల్పంగా పెరగనుంది. ఈ నీరు ఎస్పారెస్పీకి చేరాలంటే 12 గంటల సమయం పడుతుందని అధికారులు చెప్పారు.

సాగర్‌ కుడికాల్వకు...

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: సాగర్‌ కుడికాల్వకు ఎన్నెస్పీ అధికారులు శుక్రవారం నీటిని విడుదల చేశారు. కుడికాల్వ ఆయకట్టు పరిధిలో తాగునీటి అవసరాలను తీర్చడానికి నీటిని విడుదల చేయాలని ప్రాజెక్టు అధికారులు కేఆర్‌ఎంబీకు లేఖ రాశారు. డీంతో కుడికాల్వకు కేటాయించిన నీటి కేటాయింపులో భాగంగా 3 టీఎంసీలను రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని నిర్ణయించారు. సాగర్‌ జలాశయానికి ఎగువ నుంచి వరదనీరు నిలిచిపోగా జలాశయం నుంచి 4,497 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 516.20 అడుగులుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని