ట్యాంక్‌బండ్‌పై శ్రీపాదరావు విగ్రహం

కుమురం భీం, రాంజీగోండు, చాకలి ఐలమ్మ, సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ వంటి ఉద్యమకారులతోపాటు జైపాల్‌రెడ్డి, శ్రీపాదరావు వంటి ఇతర మహనీయుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated : 03 Mar 2024 05:06 IST

ఆయనతో పాటు మరికొందరివీ
దీనిపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: కుమురం భీం, రాంజీగోండు, చాకలి ఐలమ్మ, సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ వంటి ఉద్యమకారులతోపాటు జైపాల్‌రెడ్డి, శ్రీపాదరావు వంటి ఇతర మహనీయుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అందుకు త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. శనివారం రాత్రి హైదరాబాద్‌ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం- భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మాజీ శాసన సభాపతి దుద్దిళ్ల శ్రీపాదరావు జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. సీఎం ముఖ్యఅతిథిగా హాజరై శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ.. ‘పీవీ నరసింహారావు ఆదర్శాలను కొనసాగిస్తూ.. శ్రీపాదరావు మంథని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాకుండా ఉమ్మడి ఏపీ శాసన సభాపతిగా సేవలు అందించిన గొప్ప నాయకుడు. శాసనసభ నిర్వహణలో ఒక మంచి సంప్రదాయాన్ని తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారు. ఆయన కుమారుడైన శ్రీధర్‌బాబు అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం తెలంగాణ ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రిగా నా వెంట ఉంటూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. శాసనసభలో ప్రతిపక్షాలు ఏ అంశాన్ని ప్రస్తావించాలన్నా పూర్తిస్థాయి అవకాశమిస్తున్నారు. ఈ విషయంలో శ్రీధర్‌బాబుకు ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకం, తండ్రి శ్రీపాదరావు నుంచి పొందిన స్ఫూర్తి తెలుస్తున్నాయి. సంక్షేమం, పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో ఆయన అనుభవాన్ని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటోంది’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తన తండ్రి ఆశయాలు నెరవేర్చడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. శ్రీపాదరావు జీవితాన్ని నవతరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందిస్తున్న బాలలత, పూర్ణ, డాక్టర్‌ నరేందర్‌కుమార్‌, హిమాన్షీ తదితరులకు పురస్కారాలు ప్రదానం చేశారు. శ్రీపాదరావుకు నివాళిగా రూపొందించిన గీతాన్ని ఆవిష్కరించడంతోపాటు ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం తిలకించారు. కార్యక్రమంలో శ్రీపాదరావు సతీమణి జయశ్రీ, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్‌, వేం నరేందర్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, నాయకులు మధుయాస్కీ గౌడ్‌, చాడ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని