దివ్యాంగులకు త్వరలో 5 శాతం రిజర్వేషన్లు

రాష్ట్రంలోని 35 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు బయోమెట్రిక్‌ తప్పనిసరి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దివ్యాంగులకు విద్యావకాశాల్లో 5 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేసేందుకు దస్త్రాన్ని పంపాలని ఆదేశించారు.

Updated : 03 Mar 2024 05:05 IST

అంగన్‌వాడీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌
ఉపాధి హామీ కింద సొంత భవన నిర్మాణాలు
జీహెచ్‌ఎంసీలో మొబైల్‌ అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు
మహిళా, శిశు సంక్షేమశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 35 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు బయోమెట్రిక్‌ తప్పనిసరి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దివ్యాంగులకు విద్యావకాశాల్లో 5 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేసేందుకు దస్త్రాన్ని పంపాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని, ఉపాధి హామీ పథకం కింద తొలి ప్రాధాన్యంగా వీటి నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు. అంగన్‌వాడీల్లో గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొబైల్‌ అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటును పరిశీలించాలని, ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాల్లో దీనిపై అధ్యయనం చేయాలని సూచించారు. శనివారమిక్కడ సచివాలయంలో శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, సీఎస్‌ శాంతికుమారితో కలిసి మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు.

‘‘ఆర్నెల్లకోసారి ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించి శిశు సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఆరేళ్లలోపు చిన్నారులకు పూర్వప్రాథమిక విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. బాలింతలు, గర్భిణులు, చిన్నారుల పౌష్టికాహారానికి ఎన్ని నిధులు అవసరం? టీఎస్‌ ఫుడ్స్‌కు ఏమైనా పెండింగ్‌ ఉన్నాయా? చిన్నారులకు ఆటలు, బొమ్మలతో కూడిన బోధన కోసం నిధులెన్ని అవసరం? వెంటనే అధికారులు దస్త్రం పంపాలి. మహిళాశిశు సంక్షేమశాఖకు అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేస్తాం. అంగన్‌వాడీ సెంటర్లన్నీ ఒకేలా కనిపించాలి. వాటిలో బొమ్మలు, ఇతర బోధన సామగ్రి ఉంచాలి. మహిళల్లో ఎందుకు రక్తహీనత సమస్యలు వస్తున్నాయి. రక్తహీనత, పౌష్టికాహారలోపం సమస్యల నివారణకు ప్రణాళిక రూపొందించాలి.

గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చి భోజనం చేయాలా? లేదా ఇంటివద్ద చేయాలా..? వారికి సరకులు అందించేందుకు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వానికి పంపాలి. అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లు సరఫరా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. టాటా ఆధ్వర్యంలో నడిచే పారిశ్రామిక శిక్షణ కేంద్రాల సహకారం పొందాలి. బాలల న్యాయచట్టం, సీడబ్ల్యూసీ, బాలల పరిరక్షణ కమిషన్‌లో సభ్యుల నియామకాలు పూర్తిచేస్తాం. మహిళా గ్రూపులతో శానిటరీ నాప్కిన్‌లు తయారు చేయించాలి. పాఠశాల, కళాశాలల విద్యార్థినులకు ఉచితంగా నాప్కిన్‌లు అందించాలి. దివ్యాంగులకు ఉద్యోగాల్లో 4 శాతం, సంక్షేమ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలి. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, ఉపాధి కోసం ప్రత్యేక విధానం సిద్ధం చేయాలి. వృద్ధాశ్రమాల నిర్మాణాలకు అవసరమైన నిధుల ప్రతిపాదనలివ్వాలి’’ అని సీఎం ఆదేశించారు.

దత్తత ఎందుకు ఆలస్యమవుతోంది?

పిల్లల్లేని దంపతులు దత్తత కోసం దరఖాస్తు చేసిన ఎందుకు ఆలస్యమవుతోందని రేవంత్‌ అధికారులను ప్రశ్నించారు. దత్తత కోసం దరఖాస్తు చేసినా దంపతుల కుటుంబ, ఆరోగ్య, ఆదాయ, న్యాయ నివేదికలు సిద్ధం చేసేందుకు ఏడాది సమయం పడుతోందని మహిళా శిశుసంక్షేమ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 200 మంది చిన్నారులుండగా.. దాదాపు 18 వేల మందికిపైగా దంపతులు వేచి ఉన్నట్లు పేర్కొన్నారు. దత్తతకు ముందు ప్రక్రియను జిల్లాల్లో శిశు సంక్షేమ అధికారులు నిర్ణీత గడువులోగా చేపట్టాలని సీఎం సూచించారు. సమీక్షలో మహిళాశిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి వాకాటి కరుణ, కమీషనర్‌ కాంతివెస్లీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ శైలజ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని