ఇల్లు కట్టే వేళాయె..

లోక్‌సభ ఎన్నికలకు ముందే మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని హామీల్లో ఇప్పటికే నాలుగింటిని సర్కారు అమలులోకి తీసుకువచ్చింది.

Updated : 03 Mar 2024 06:52 IST

ఇందిరమ్మ ఇళ్ల పథకం 11న ప్రారంభం
సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం
స్థలం లేని వారికి ఆర్థిక చేయూతతోపాటు జాగా
మొదటి దశలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 గృహాలు
పకడ్బందీగా అమలుకు విధివిధానాలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు ముందే మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని హామీల్లో ఇప్పటికే నాలుగింటిని సర్కారు అమలులోకి తీసుకువచ్చింది. తాజాగా మరో హామీని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని ఈ నెల 11వ తేదీన ప్రారంభించనుంది. అందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పథకంపై సచివాలయంలో శనివారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.

‘‘ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలి. గూడు లేని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చటమే ప్రభుత్వ లక్ష్యం. పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు విధివిధానాలు రూపొందించాలి. స్థలం ఉన్నవారికి అదే స్థలంలో నూతన ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేయాలి. స్థలం లేని నిరుపేదలకు జాగాతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.అయిదు లక్షలు ఇస్తాం. ఏయే దశల్లో నిధులను విడుదల చేయాలో నిబంధనలను రూపొందించండి. లబ్ధిదారులకు అందించే నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు సిద్ధం చేయాలి. పథకాన్ని దశలవారీగా అమలు చేయాలి. తొలి దశలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 3,500 ఇళ్లను మంజూరు చేయాలి. అర్హులైన ఇల్లు లేని పేదలందరికీ పథకాన్ని అమలు చేయాలి.

ఇంటి నమూనాలు..: సొంత జాగాలో ఇల్లు కట్టుకునేవారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు తయారు చేయించాలి. లబ్ధిదారులు తమకు అనుగుణంగా సొంతింటి నిర్మాణం చేపట్టినప్పటికీ తప్పనిసరిగా ఒక వంట గది, టాయిలెట్‌ ఉండేలా చూడాలి. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వివిధ శాఖల్లో ఉన్న ఇంజినీరింగ్‌ విభాగాలకు అప్పగించాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రహదారులు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని