విద్యుత్‌ సంస్థల్లో పైరవీకారులపై కొరడా

కీలక ప్రాంతాల్లో పాతుకుపోయి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విద్యుత్‌ సంస్థ ఇంజినీర్లు, ఇతర ఉద్యోగులపై కొత్తగా వచ్చిన సీఎండీలు దృష్టి సారించారు.

Published : 03 Mar 2024 03:47 IST

పని చేయని ఇంజినీర్లపై చర్యలు
ఒకేచోట పాతుకుపోయిన వారికి బదిలీలు

ఈనాడు, హైదరాబాద్‌: కీలక ప్రాంతాల్లో పాతుకుపోయి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విద్యుత్‌ సంస్థ ఇంజినీర్లు, ఇతర ఉద్యోగులపై కొత్తగా వచ్చిన సీఎండీలు దృష్టి సారించారు. కొందరు ఇంజినీర్లు రాజకీయ నేతల అండతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో గచ్చిబౌలి డీఈని క్రమశిక్షణ చర్యల కింద మింట్‌కాంపౌండ్‌లోని డిస్కం ప్రధాన కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. మిర్యాలగూడలో విద్యుత్‌ డిమాండును సరిగా అంచనా వేయకుండా కోతలకు కారణమైనందుకు డీఈకి ఛార్జి మెమో జారీ చేసింది. కొండాపూర్‌ ప్రాంతంలో అకస్మాత్తుగా సరఫరా నిలిపివేసిన ఒక లైన్‌మెన్‌, మరో ఇద్దరు జూనియర్‌ లైన్‌మెన్లను డిస్కం సస్పెండ్‌ చేసింది. రెండు రోజుల క్రితం తాత్కాలిక ఉద్యోగికి వేతన బకాయిల సొమ్ము విడుదల చేయడానికి రూ.35 వేల లంచం తీసుకుంటూ దక్షిణ డిస్కం హైదరాబాద్‌ హబ్సిగూడ కార్యాలయం జూనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ అనిశాకు పట్టుబడ్డారు. గతంలో పైరవీలతో కీలక పోస్టుల్లో చేరిన ఇంజినీర్లకు విద్యుత్‌ సంస్థలు స్థానచలనం కల్పిస్తున్నాయి. అయితే వీరిలో కొందరు కదిలేదిలేదంటూ ఇంకా పైరవీలు చేస్తుండటం గమనార్హం. ఇటీవల ముగ్గురు డివిజనల్‌ ఇంజినీర్ల(డీఈ)ను బదిలీ చేస్తూ మూడు విద్యుత్‌ సంస్థలు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. వీరిలో ఇద్దరు రిలీవ్‌ కాకుండా బదిలీని ఆపేందుకు ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఒక డీఈపై పలు ఆరోపణలు ఉండటంతో బదిలీ చేస్తూ దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం) సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు డీఈ నగరంలోని ఓ ఎమ్మెల్యేకు, ఏపీలో ఓ వైకాపా ముఖ్యనేతకు దగ్గరని ప్రచారం ఉంది.

ఐటీ కారిడార్‌లో అనేక వివాదాలు

నగరంలోని ఐటీ కారిడార్‌, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేస్తున్న ప్రాంతాల్లో విద్యుత్‌ ఇంజినీర్ల పోస్టులకు బాగా డిమాండు ఉంది. ఇక్కడ ఏఈ, ఏడీఈ, డీఈ పోస్టు దక్కాలంటే పలుకుబడితోపాటు పెద్దమొత్తంలో లంచాలు ఇవ్వాలనే ప్రచారం ఉంది. విద్యుత్‌ సంస్థల్లో ఫోకల్‌(కీలక), నాన్‌ ఫోకల్‌(అప్రాధాన్య) విభాగాలుంటాయి. ఐటీ కారిడార్‌లో ఏఈ లేదా డీఈగా మూడేళ్లు పనిచేస్తే తప్పనిసరిగా కార్యాలయంలో నాన్‌ఫోకల్‌ పోస్టులోకి బదిలీ చేయాలి. కానీ కొందరు ఫోకల్‌ పోస్టుల్లోనే పాతుకుపోయి అక్రమార్జనకు పాల్పడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఎర్రగడ్డలో ట్రాన్స్‌కోకు చెందిన చీఫ్‌ ఇంజినీరు గ్రామీణ విభాగం కార్యాలయం ఉంది. అక్కడ అకౌంట్స్‌ విభాగంలో దశాబ్దకాలంగా పనిచేస్తున్న సిబ్బంది, తాత్కాలిక ఉద్యోగులు బయట ఇతర వ్యాపారాలు చేసుకుంటూ రోజూ మధ్యాహ్నం 2 గంటల తరువాత ఆఫీసుకు వస్తున్నట్లు సీఎండీ రిజ్వీకి కొందరు ఫిర్యాదు చేశారు.

రాజకీయ వివాదాలతోనూ పలు మార్పులు..

నల్గొండ జిల్లా దామెరచర్ల వద్ద నిర్మిస్తున్న యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణలో అక్రమాలు జరిగాయని విజిలెన్స్‌ విచారణ జరుగుతోంది. దీనికితోడు ఇసుక, కంకర తరలింపు గుత్తేదారు మార్పు కోసం కొందరు నేతలు పట్టుబట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి సహాయ డీఈ(ఏడీఈ)ని రామగుండం థర్మల్‌ విద్యుత్కేంద్రానికి బదిలీ అయ్యారు. రాజకీయ నేతల మధ్య వివాదాలకు ఏడీఈని ఎలా బదిలీ చేస్తారని ఉద్యోగ సంఘాలు నిరసన తెలిపినట్లు సమాచారం. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఇటీవల కొన్ని గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీని వెనుక ప్రతిపక్ష నేతల హస్తం ఉందని ఆరోపణలు రావడంతో వెంటనే అక్కడి సహాయ ఇంజినీరు(ఏఈ)ని జోగులాంబ జిల్లా ఆలంపూర్‌కు బదిలీ చేస్తూ ట్రాన్స్‌కో ఉత్తర్వులు జారీ చేసింది. ఒక లైనులో మంటలు వస్తే టెక్నికల్‌ అసిస్టెంటు మరో లైను సరఫరా నిలిపివేశారని, దీనికి ఏఈని బదిలీ చేయడమేంటని రాష్ట్ర ఇంజినీర్ల సంఘం ట్రాన్స్‌కో అధికారుల వద్ద నిరసన తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని