కొత్త పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలు

తెలంగాణలో పంచాయతీలకు పూర్వవైభవం తెస్తామని, గ్రామ స్వరాజ్యానికి కృషి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Published : 03 Mar 2024 03:47 IST

గ్రామ స్వరాజ్యం కోసం కృషి చేస్తాం
మంత్రి పొన్నం ప్రభాకర్‌

ఈనాడు - హైదరాబాద్‌, న్యూస్‌టుడే- శంషాబాద్‌: తెలంగాణలో పంచాయతీలకు పూర్వవైభవం తెస్తామని, గ్రామ స్వరాజ్యానికి కృషి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. అధికారాల వికేంద్రీకరణ ద్వారా ముందుకు వెళతామని, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌, పురపాలక వ్యవస్థలను పటిష్ఠం చేసేందుకు కొత్త చట్టాలు తెస్తామన్నారు. శంషాబాద్‌లో శనివారం జరిగిన రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌  సంఘటన్‌ తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘‘గత పదేళ్లుగా భారాస ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసింది. ఈ వ్యవస్థలో ప్రతినిధులకు సంబంధం లేకుండానే కార్యక్రమాలు జరిగిపోయాయి..బిల్లులు రాక సర్పంచులు ఇబ్బందులు పడ్డారు. మున్ముందు వారికి ఎలాంటి సమస్యలూ ఉండవు. పంచాయతీరాజ్‌, పురపాలక రంగాలకు కొత్త చట్టాలు తీసుకురావడం ద్వారా ప్రజాప్రతినిధుల ఇబ్బందులను తొలగిస్తాం. పంచాయతీరాజ్‌ సంఘటన్‌ ద్వారా గ్రామస్థాయి కార్యక్రమాలను చేపట్టాలి. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజాప్రతినిధులు మద్దతునిచ్చారు. మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్‌ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం నిర్వహించడం అభినందనీయం’’ అని పొన్నం పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని