రక్షణశాఖ భూముల కోసం అలుపెరగని పోరాటం: కేటీఆర్‌

హైదరాబాద్‌లో ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి అవసరమైన రక్షణశాఖ భూముల కోసం అలుపెరగని పోరాటం చేశామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Published : 03 Mar 2024 03:48 IST

కేంద్రానికి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి అవసరమైన రక్షణశాఖ భూముల కోసం అలుపెరగని పోరాటం చేశామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులకు నాడు భారాస ప్రభుత్వం పదుల సంఖ్యలో వినతిపత్రాలు ఇవ్వడం వల్ల.. ఇన్నాళ్లకు దిగొచ్చిన కేంద్ర సర్కారుకు తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం స్కై వేల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు పదేళ్ల పాటు భారాస చేసిన సుదీర్ఘ పోరాటం ఫలించడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌-కరీంనగర్‌, నాగ్‌పుర్‌ మార్గాల్లో ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి రక్షణశాఖ భూములు ఇవ్వడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత జులై 31న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో భారాస ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కేంద్రం ఆమోదం తెలపడం హర్షించదగ్గ పరిణామన్నారు. గతంలోనే రక్షణశాఖ తమ అధీనంలోని 33 ఎకరాలను కేటాయించిందని, ఇప్పుడు మరో 150 ఎకరాలను అప్పగించేందుకు ముందుకు రావడంతో స్కైవేల నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని వెల్లడించారు. తమ పాలనలో మెరుపు వేగంతో నిర్మించిన వంతెనలు, అండర్‌ పాస్‌ల వల్ల హైదరాబాద్‌ మహానగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తీరాయని స్పష్టంచేశారు. తాజాగా జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట, ప్యారడైజ్‌ నుంచి కండ్లకోయ మార్గాల్లో రెండు ఫ్లైఓవర్లకు కేంద్రం ఆమోదం లభించినందున.. రాష్ట్ర ప్రభుత్వం వీటి నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని