పెట్టుబడులకు అనువైన రాష్ట్రం తెలంగాణ

పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శనివారం సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశం మాదాపూర్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌లో నిర్వహించారు.

Updated : 03 Mar 2024 04:32 IST

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

మాదాపూర్‌, న్యూస్‌టుడే: పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శనివారం సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశం మాదాపూర్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భట్టి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా సమయం ఇవ్వని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండదని, 24 గంటలు ముఖ్యమంత్రి, రాష్ట్ర కేబినెట్‌ మొత్తం అందుబాటులో ఉంటుందన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన కొత్త ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో డెయిరీ పరిశ్రమకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పించడానికి అనువుగా ఉన్న ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని సూచించారు. గోదావరి, కృష్ణా నదులను మూసీకి అనుసంధానం చేసి స్వచ్ఛమైన నీరు పారేలా మూసీని ప్రక్షాళన చేయనున్నట్లు వివరించారు. ఔటర్‌రింగ్‌ రోడ్డు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు మధ్య టెక్స్‌టైల్‌, గ్రానైట్‌, మైనింగ్‌ తదితర క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు రవాణా సదుపాయంలో ఇప్పటి వరకు 18.50 కోట్ల మందికి జీరో టికెట్లు ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం సీఐఐ రూపొందించిన వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాయిప్రసాద్‌, సీఐఐ సౌత్‌ రీజియన్‌ ఛైర్మన్‌ కమల్‌బలి, తెలంగాణ ఛైర్మన్‌ శేఖర్‌రెడ్డి తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని