మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన మూడు బ్యారేజీలలోనూ కట్‌ ఆఫ్‌ వాల్‌-  సీకెంట్‌ పైల్‌్్సకు సంబంధించిన డిజైన్‌ అమలులో తేడా ఉన్నట్లు నేషనల్‌ డ్యాం సేఫ్టీ(ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలిసింది.

Published : 23 Mar 2024 05:32 IST

అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజీ పనులు
మూడో రోజు విచారణలో నిపుణుల కమిటీ దృష్టికి కీలక అంశాలు
అన్నారం.. మేడిగడ్డ మధ్య వ్యత్యాసాలు ఎందుకు?
డీపీఆర్‌ ఆమోదం పొందకముందే గుత్తేదారుతో ఒప్పందం ఎలా?
పలు ఇంజినీరింగ్‌ విభాగాలను ప్రశ్నించిన అయ్యర్‌ బృందం

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన మూడు బ్యారేజీలలోనూ కట్‌ ఆఫ్‌ వాల్‌-  సీకెంట్‌ పైల్‌్్సకు సంబంధించిన డిజైన్‌ అమలులో తేడా ఉన్నట్లు నేషనల్‌ డ్యాం సేఫ్టీ(ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. మేడిగడ్డలో పెద్దఎత్తున లోపాలు ఉన్నాయని, బ్యారేజీ వద్ద కట్‌ ఆఫ్‌ వాల్‌- సీకెంట్‌ పైల్స్‌ నిర్మాణంలో అనుసరించాల్సిన మెథడాలజీని పాటించలేదని, గైడ్‌వాల్స్‌ లేవనే విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై లోతుగా అధ్యయనం చేస్తున్న నిపుణుల కమిటీ పలు కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. అన్నారం బ్యారేజీలో రాఫ్ట్‌ కిందనే సీకెంట్‌ పైల్స్‌ ఉంటే, మేడిగడ్డ బ్యారేజీలో రాఫ్ట్‌కు సీకెంట్‌ పైల్స్‌కు మధ్య ఒక మీటర్‌ తేడా ఉందని, దీనికి కారణమేంటని ఇంజినీర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. మూడో రోజు విచారణలో భాగంగా కమిటీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని బృందం శుక్రవారం సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) ఇంజినీర్లతో, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో, నిర్మాణంలో పాలుపంచుకొన్న ఇంజినీర్లతో సుదీర్ఘంగా చర్చించింది. నిర్మాణ స్థలం నిర్ధారణలో మీ పాత్ర ఏంటి? ఇందులో సీకెంట్‌ పైల్స్‌ ఎందుకు చేయాల్సి వచ్చింది, సీడీవో పాత్ర డిజైన్‌ వరకే పరిమితమా అని ప్రశ్నించింది. ఇన్వెస్టిగేషన్‌, హైడ్రాలజీతో సంబంధం లేదని సీడీవో ఇంజినీర్లు చెప్పారు. ‘‘మొదట షీట్‌ పైల్స్‌/ఆర్‌.సి.సి.డయాఫ్రం వాల్‌ ప్రతిపాదించాం. షీట్‌ పైల్స్‌ వీలు కాదని ఎన్‌.ఐ.టి. వరంగల్‌ ప్రొఫెసర్లు అధ్యయనం చేసి తేల్చారని కాళేశ్వరం చీఫ్‌ ఇంజినీర్‌ లేఖ రాశారు. సీకెంట్‌ పైల్స్‌ ప్రతిపాదనను మొదట ఎల్‌అండ్‌టీ తీసుకొచ్చింది. ఉత్తర ప్రత్యుత్తరాల క్రమంలో  2017 ఏప్రిల్‌ 17న కాళేశ్వరం సీఈ.. సీడీవోకు లేఖ రాశారు. నిర్మాణ స్థలాన్ని బట్టి మూడు బ్యారేజీలలోనూ సీకెంట్‌ పైల్స్‌- కట్‌ ఆఫ్‌ చేపట్టాలని నిర్ణయించామని, దీని ప్రకారం డిజైన్‌ ఇవ్వాలని కోరారు’’ అని సీడీవో ఇంజినీర్లు నిపుణుల కమిటీకి వివరించినట్లు సమాచారం. సీకెంట్‌ పైల్స్‌ వర్టికాలిటీలో ఏదైనా సమస్య అనిపిస్తే ఉన్నతస్థాయి కమిటీకి నివేదించాలని కూడా కోరామని చెప్పినట్లు తెలిసింది. పని సరిగా చేయకుంటే దాన్ని నిలుపుదల చేసే అధికారం ఉందా.. అని అయ్యర్‌ అడగ్గా, లేదని సీడీవో ఇంజినీర్లు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. బోర్‌వెల్స్‌ డేటా గురించి పదే పదే ఎందుకు అడిగారు, మీకేమైనా అనుమానం వచ్చిందా అని కమిటీ.. వారిని ప్రశ్నించింది. రెండు కిలోమీటర్ల బ్యారేజీకి మూడు బోర్‌వెల్స్‌ డేటా సరిపోదని, పదేపదే ఒత్తిడి చేసిన తర్వాత 30 వరకు బోర్‌వెల్స్‌ డేటా ఇచ్చారని వారు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

నిర్వహణ లోపాలపై ఆరా

ఓఅండ్‌ఎం ఇంజినీర్లతో జరిగిన సమావేశంలో.. మూడు బ్యారేజీలకు సంబంధించిన నిర్వహణ డేటాను అందజేయాలని కమిటీ సూచించింది. నిర్వహణ లోపాలపైనా ఆరా తీసినట్లు తెలిసింది. నిర్మాణ సంస్థ  నిర్వహణ బాధ్యతలు చూస్తోందని, ఇంకా నిర్వహణ గడువు ఆ సంస్థపై (డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌) ఉందని ఓఅండ్‌ఎం ఇంజినీర్లు పేర్కొన్నట్లు సమాచారం.

క్వాంటిటీస్‌ ఎందుకు పెరిగాయ్‌?

2017 ఫిబ్రవరిలో డీపీఆర్‌కు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపితే 2016లోనే కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకున్నారని, ఇదెలా సాధ్యమైందని కమిటీ.. ఇంజినీర్లను అడిగినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. రాడార్‌ సర్వేలో డిపార్ట్‌మెంట్‌ ఇంజినీర్లు భాగస్వాములై ఉంటే వారి వివరాలు ఇవ్వాలని, బ్యారేజీలు ప్రారంభించిన తర్వాత ఎక్కువ వరద వివరాలు, బ్యారేజీల పైన, దిగువన చేసిన పరీక్షల రికార్డులన్నింటిపైనా సంతకాలు చేసి ఇవ్వాలని కమిటీ కోరింది. మేడిగడ్డ బ్యారేజీలో డీపీఆర్‌లో పేర్కొన్న దానికన్నా క్వాంటిటీస్‌ ఎందుకు పెరిగాయని అడిగినట్లు తెలిసింది. ఈ డీపీఆర్‌ను కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్‌ తయారు చేసింది.

రాజీవ్‌ రతన్‌తో భేటీ

చంద్రశేఖర్‌ అయ్యర్‌ కమిటీ శుక్రవారం మధ్యాహ్నం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రతన్‌తో భేటీ అయింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీల్లో లోటుపాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ చేస్తోంది. విజిలెన్స్‌ విచారణ సందర్భంగా గుర్తించిన అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.

పునరుద్ధరణ చర్యలపై తాత్కాలిక సిఫార్సులు చేయండి

నీటిపారుదల కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, ఈఎన్సీలు అనిల్‌కుమార్‌, నాగేంద్రరావుతో కూడా కమిటీ సమావేశం అయింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యలపై తాత్కాలిక సిఫార్సులు చేయాలని, వర్షాకాలంలో వచ్చే వరదల మూలంగా బ్యారేజీ మరింత దెబ్బతినకుండా నివారించేందుకు తగిన సూచనలు చేయాలని కమిటీని వారు కోరారు. దీనికి స్పందించిన కమిటీ తాము కోరుతున్న సమాచారం వెంటనే అందించాలని, బ్యారేజీ వద్ద ప్రమాద నివారణ చర్యలపై తాత్కాలిక సిఫార్సులను అందజేస్తామని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

జలసౌధలో చివరి రోజు విచారణ అనంతరం హిమాయత్‌సాగర్‌లో తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీని కమిటీ సందర్శించింది. అక్కడ ఏర్పాటు చేసిన మేడిగడ్డ, ఇతర బ్యారేజీల మోడల్‌ స్టడీస్‌ నమూనాలను పరిశీలించింది. ఫ్లడ్‌ డిశ్చార్జి, హైడ్రాలిక్‌ పర్టిక్యులర్స్‌తోపాటు వివిధ దశల్లో నీటి విడుదల, నిల్వ ప్రభావాలకు సంబంధించి గతంలో చేసిన అధ్యయనాలను చూసింది. స్టేట్‌ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (ఎస్డీఎస్‌వో) ఇంజినీర్లతోనూ కమిటీ భేటీ అయింది.


మరింత లోతుగా విచారించాల్సి ఉంది: చంద్రశేఖర్‌ అయ్యర్‌

బ్యారేజీలకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని చంద్రశేఖర్‌ అయ్యర్‌ పేర్కొన్నారు. జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డతోపాటు ఇతర ఆనకట్టల అంశం పరిశీలనలో ఉందన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు