Telangana News: టెట్‌ రుసుములు భారీగా పెంపు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) దరఖాస్తుకు విద్యాశాఖ రుసుములు భారీగా  పెంచింది. గతంలో ఒక పేపర్‌ రాస్తే రూ.200 రుసుము ఉండగా... దాన్ని రూ.వెయ్యికి పెంచింది.

Updated : 23 Mar 2024 08:55 IST

ఒక పేపర్‌ రాస్తే రూ.వెయ్యి.. రెండు రాస్తే రూ.2 వేలు
గతంలో రూ.200.. రూ.300

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) దరఖాస్తుకు విద్యాశాఖ రుసుములు భారీగా  పెంచింది. గతంలో ఒక పేపర్‌ రాస్తే రూ.200 రుసుము ఉండగా... దాన్ని రూ.వెయ్యికి పెంచింది. రెండు పేపర్లు రాస్తే గతంలో రూ.300 రుసుము ఉండగా.. దాన్ని రూ.2,000కు పెంపుదల చేసింది. ఈ మేరకు టెట్‌కు సంబంధించిన సమాచార పత్రాన్ని శుక్రవారం విడుదల చేసింది. ఇందులో రుసుముల వివరాలు, ఇతర అంశాలను వెల్లడించింది. టెట్‌-2024 కోసం ఈ నెల 15న నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 27 నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ సమయంలో సహాయ కేంద్రం సేవలు సైతం అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది. మే 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో పరీక్షలను మే 20 నుంచి జూన్‌ మూడో తేదీ వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. పేపర్‌-1 ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుందని తెలిపింది. పరీక్ష ఫలితాలు జూన్‌ 12న విడుదలవుతాయని పేర్కొంది. అభ్యర్థులు పేపర్‌-1, పేపర్‌-2లలో ఏదేని ఒక పరీక్ష రాస్తే రూ.వెయ్యి, రెండు పేపర్లూ రాస్తే రూ.రెండు వేలు చెల్లించాలని విద్యాశాఖ సూచించింది. టెట్‌ను 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపింది.

  • టెట్‌ పేపర్‌ 1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్‌ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్‌ అభ్యర్థులకు ఇంటర్‌లో 45%, ఇతరులకు 40% మార్కులు ఉన్నా అర్హులే.  
  • టెట్‌ పేపర్‌-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్‌ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఇతరులకు 45% మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50%, ఇతరులకు 40% మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్‌ టీచర్లు కూడా టెట్‌ రాయవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని