మౌలిక వసతులతో రెట్టింపు పని

న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అన్నారు.

Published : 28 Mar 2024 05:21 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌
హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన
32 ఈసేవా కేంద్రాలనూ ప్రారంభించిన సీజేఐ
కొత్త భవనం అసమానతలకు తెరదించాలని ఆకాంక్ష

ఈనాడు, హైదరాబాద్‌: న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అన్నారు. సరైన మౌలిక వసతులుంటే రెట్టింపు పనిచేయగలరని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేలులో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ బుధవారం శంకుస్థాపన చేశారు. ఆయనతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌, జస్టిస్‌ ఎస్‌.వి.భట్టి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధేలు భూమిపూజ నిర్వహించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో 31 జిల్లాల్లోని 32 ఈ-సేవా కేంద్రాలను జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడారు.

గతంలో జిల్లా కోర్టుల్లో  మరుగుదొడ్లూ లేని దుస్థితి

‘‘వ్యవస్థ కోసం జీవితాన్ని వెచ్చించే న్యాయవాదులు, న్యాయమూర్తులకు సౌకర్యవంతమైన ఛాంబర్లు.. జడ్జీలు, న్యాయవాదులను కలవడానికి వచ్చేవారికి, యువ న్యాయవాదులకు ప్రత్యేకమైన ప్రాంతాలు అవసరం. దేశంలో చాలా జిల్లా కోర్టుల్లో మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంతో మహిళా న్యాయవాదులు, జడ్జీలు ఉదయం కోర్టుకు వచ్చినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లేదాకా ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వచ్చింది. సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ప్లానింగ్‌ నుంచి సుప్రీంకోర్టు నివేదిక తెప్పించగా జిల్లా కోర్టులతోపాటు పలు హైకోర్టుల్లో మౌలిక వసతుల కొరత ఉందని తేలింది. గతంలో పరిస్థితులు సరిగా లేక.. బెయిలు, పిల్లల నిరాదరణకు గురైన తల్లిదండ్రులు, గృహహింస వంటి సున్నిత కేసుల్లోనూ న్యాయమూర్తులు ఉదాసీనంగా పనిచేసేవారు. దివ్యాంగులు, దృష్టి లోపం ఉన్నవారు, పసిబిడ్డల తల్లులు న్యాయస్థానాలకు వచ్చినప్పుడు సరైన వసతులు లేక ఇబ్బందులు పడేవారు. తెలంగాణ హైకోర్టు నూతన భవనం ఇలాంటి సమస్యలన్నింటికీ తెరదించాలి.

రూ.7 వేల కోట్లతో ఈ-కోర్టుల మూడో దశ

దేశవ్యాప్తంగా రూ.7,000 కోట్లతో చేపట్టిన ఈ-కోర్టుల మూడో దశలో భాగమే తెలంగాణలో ప్రారంభించిన 32 ఈ-సేవా కేంద్రాలు. ప్రస్తుతం న్యాయవాదులు, న్యాయమూర్తులతోపాటు ప్రజలకూ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. సాంకేతికతలో ఎవరూ వెనుకబడకూడదు. సమాజంలో యువత పెరుగుతోంది. విధానాల రూపకర్తలు వారిని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. యువ న్యాయవాదులు తక్షణ ఫలితం ఆశిస్తున్నారు. వివాదాలకు కోర్టుల్లో పరిష్కారం కంటే మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్‌ మార్గాలూ ఉన్నాయి.

జిల్లా కోర్టుల్లో 50 శాతానికి పైగా మహిళలే

మన పితృస్వామిక వ్యవస్థలో సామాజిక అసమానతలు, శారీరక దారుఢ్య సమస్యల కారణంగా గతంలో మహిళలు న్యాయవ్యవస్థలో రాణించడానికి అడ్డంకులు ఉండేవి. ప్రస్తుతం సామాజిక పరిస్థితుల్లోనూ మార్పు వచ్చింది. అన్ని రాష్ట్రాల్లోని జిల్లా కోర్టుల్లో మహిళల సంఖ్య పెరిగింది. జిల్లా జడ్జీల్లో 50 శాతం దాకా వారే ఉంటున్నారు. వచ్చే దశాబ్దకాలంలో న్యాయమూర్తులు, బార్‌లో వారే కీలకం కానున్నారు. వారికి ప్రత్యేకంగా గదులు ఉండాలి. సీనియర్‌ న్యాయవాదులు, న్యాయమూర్తులు.. యువ న్యాయవాదులు, జడ్జీలకు మార్గదర్శనం చేయాలి. హైకోర్టు కొత్త భవనానికి స్థలం కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి, అందుకు కృషి చేసిన న్యాయమూర్తులకు అభినందనలు’’ అని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అన్నారు.

న్యాయవాదులకూ ఛాంబర్‌ అవసరం: జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ

న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులకు, న్యాయవాదులకూ మెరుగైన ఛాంబర్లు ఉండాలన్నది తన కల అని, మూడు దశాబ్దాల్లో ఇది వాస్తవ రూపం దాల్చుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ పేర్కొన్నారు. విధుల నిర్వహణకు మెరుగైన వాతావరణం అవసరమన్నారు. తెలంగాణ హైకోర్టు భవనం నిర్మిస్తున్న ప్రాంతంలో పచ్చదనం బాగా ఉందని, దాని పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే మాట్లాడుతూ.. సత్వర న్యాయం అందించడానికి మెరుగైన మౌలిక సదుపాయాలు అవసరమన్నారు. పర్యావరణానికి భంగం వాటిల్లనివ్వబోమని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ జి.ప్రవీణ్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


యువ న్యాయవాదులు తక్షణ ఫలితాన్ని ఆశిస్తున్నారు. తమకు అవకాశం కోసం నెలల తరబడి క్యూలో నిలబడలేని అసహనంతో ఉన్నారు. సుదీర్ఘ కాలం పాటు విచారణ ప్రక్రియను కొనసాగించే పరిస్థితిలో వారు లేరు. న్యాయస్థానాల్లో కొత్తగా ఏర్పాటుచేసే మౌలిక వసతులు మెరుగైన పని పరిస్థితులు కల్పిస్తాయని ఆశిస్తున్నా.

సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌


హైకోర్టు భవనం.. విలువలకు, ఆలోచనలకు, హక్కులకు, విధులకు, బాధ్యతల నిర్వహణతోపాటు చట్టం ఆధిపత్యాన్ని నిలిపే ప్రజాక్షేత్రం.


తెలంగాణ హైకోర్టు కొత్తగా ఏర్పాటైనప్పటికీ ఎంతో చరిత్ర ఉంది. 1919లో ఏడో నిజాం మీర్‌ అలీఖాన్‌ నిర్మించిన భవనం చారిత్రకచిహ్నంగా నిలవడమే కాకుండా మానవతామూర్తులను అందించింది. జస్టిస్‌ కోకా సుబ్బారావు, జస్టిస్‌ ఓ.చిన్నపరెడ్డి, జస్టిస్‌ బి.జీవన్‌రెడ్డిలతోపాటు ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో పనిచేసిన జస్టిస్‌ అల్లాడి కుప్పుస్వామి ఇక్కడి నుంచే వచ్చారు.

 సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని