వ్యాట్‌నూ తాగేశారు

మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.

Updated : 28 Mar 2024 06:56 IST

మద్యంపై విలువ ఆధారిత పన్ను భారీగా ఎగవేత
అమ్మిన సరకంతా లెక్కల్లో చూపకుండా గోల్‌మాల్‌
రెండు డిస్టిలరీల్లోనే రూ.500 కోట్ల అక్రమాలు బహిర్గతం
మొత్తం 19 చోట్లా తనిఖీ చేస్తే ఇంకెంతో?
వ్యాపారులు, అధికారులు, నేతల కుమ్మక్కు!
విచారణలో గుర్తించిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తయారీ నుంచి అమ్మకాల దాకా పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడి రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.వందల కోట్ల ‘విలువ ఆధారిత పన్ను’(వ్యాట్‌)ను ఎగ్గొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ అవినీతి వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఎక్సైజ్‌ అధికారులు కుమ్మక్కై ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. మద్యం అమ్మకాలెంత, ఖజానాకు ఏటా చెల్లించిన వ్యాట్‌ సొమ్ము ఎంత అనే కోణంలో సమగ్ర విచారణ జరుగుతోంది. ఈ విచారణ ప్రారంభించగానే ఏటా ఎన్ని లీటర్లు అమ్మారనే లెక్కలను పబ్లిక్‌ డొమైన్‌(పోర్టల్‌) నుంచి ఎక్సైజ్‌ శాఖ తొలగించడం గమనార్హం. ఈ వివరాల కోసం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయానికి ఇప్పటికే రెండుసార్లు లేఖలు రాసినా ఫలితం లేకుండాపోయింది. ప్రభుత్వం మారగానే ఈ లెక్కలను అధికారులు ఎందుకు దాస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడు, కొత్త సంవత్సర వేడుకలు, ఇతర పండగలు, ఉత్సవాల సమయంలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి. కానీ, అదేస్థాయిలో మద్యంపై వచ్చే పన్ను ఆదాయం పెరగకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి అనుమానమొచ్చి లోతుగా విచారణ ప్రారంభించింది. ఉదాహరణకు 2021-22 ఆర్థిక సంవత్సరం 2021 నవంబరులో రూ.1,007 కోట్లు, డిసెంబరులో రూ.1,536 కోట్లు మద్యంపై వ్యాట్‌ రూపంలో ఖజానాకు వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో అవే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలున్నందున మద్యం అమ్మకాలు భారీగా పెరిగినా వ్యాట్‌ అదనంగా రాలేదు. 2023 నవంబరులో రూ.1,021 కోట్లు, డిసెంబరులో రూ.1,388 కోట్లు మాత్రమే వ్యాట్‌గా చెల్లించారు. ఎన్నికలున్నప్పుడు మద్యం అమ్మకాలు పెరిగితే వ్యాట్‌ ఎందుకు తగ్గిందని ప్రభుత్వం విచారణ చేయిస్తోంది.

ఇదెలా సాధ్యం...

వ్యాట్‌ ఎగవేత ఉదంతాల నేపథ్యంలో మద్యం తయారు చేసే రెండు డిస్టిలరీల్లో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ విచారణ జరపగా.. విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ రెండింటిలోనే రూ.528.75 కోట్ల వ్యాట్‌ ఎగవేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మద్యం తయారీలో డీ…మినరలైజ్డ్‌ నీటిని కలుపుతారు. ఈ నీరు ఎంత సరఫరా చేశారు, వాటితో మద్యం ఎంత తయారుచేశారనే లెక్కలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పోల్చి తనిఖీలు చేస్తే 123.82 లక్షల లీటర్ల మద్యాన్ని పన్నులు చెల్లించకుండా అక్రమంగా సరఫరా చేసినట్లు తేలింది. వాస్తవానికి ఈ అక్రమ మద్యంపై రూ.528.75 కోట్ల వ్యాట్‌ ఎగవేసినట్లు స్పష్టంగా తేలింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 డిస్టిలరీలున్నాయి. కేవలం రెండు డిస్టిలరీల్లోనే ఏకంగా ఒక్క ఏడాదిలోనే రూ.528.75 కోట్లు ఎగవేస్తే రాష్ట్రమంతా తనిఖీలు చేస్తే భారీగా అక్రమాలు బయటపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. పైగా ఈ రెండు డిస్టిలరీల్లో ‘ఓవర్‌టైం రిలాక్సేషన్‌’(మినహాయింపు) ఇచ్చి అదనపు మద్యం తయారీకి గత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినట్లు తేలింది. వ్యాట్‌ ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని ఈ డిస్టిలరీలకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. 

అమ్మకాలతో పొంతనే లేదు..

మద్యం ఒక్కదానిపై వ్యాట్‌ పేరుతో పన్ను వసూలు చేస్తున్నారు. మిగతా అన్ని రకాల వస్తువులు, సామగ్రి, సేవలపై జీఎస్టీని వసూలు చేస్తారు. రాష్ట్ర జీఎస్టీ పద్దు కింద ఏటా 18 శాతం వృద్ధి రేటు నమోదవుతుంటే వ్యాట్‌ మాత్రం ఐదారు శాతానికి ఎందుకు మించడం లేదని ప్రభుత్వం ఎక్సైజ్‌ శాఖను తాజాగా ప్రశ్నించింది. మద్యం అమ్మకాల విలువ భారీగా పెరుగుతున్నట్లు ఎక్సైజ్‌శాఖ లెక్కలే చెపుతున్నాయి. కానీ, వ్యాట్‌ మాత్రం అదేస్థాయిలో పెరగకపోవడంతో విచారణకు ఆదేశించింది. ఉదాహరణకు 2018లో రూ.20,012 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా 2021లో రూ.30,222 కోట్లకు చేరాయి. అంటే నాలుగేళ్లలో ఏకంగా 50 శాతం అమ్మకాలు పెరిగాయి. కానీ, ఇదే కాలంలో వ్యాట్‌ 50 శాతం పెరగలేదని వాణిజ్య పన్నులశాఖ తనిఖీల్లో గుర్తించారు. 2018 జులై నెలలో మద్యం అమ్మకాలపై రూ.1,200 వ్యాట్‌ను ఖజానాకు చెల్లించగా.. 2023 జులైలో సైతం రూ.1,260 కోట్లు మాత్రమే వసూలవడం గమనార్హం.

డిస్టిలరీ నుంచి గోదాములకు మద్యాన్ని రాష్ట్ర బేవరేజెస్‌ సంస్థ తరలిస్తుంది. అక్కడి నుంచి దుకాణాల వ్యాపారులు తీసుకెళతారు. డిస్టిలరీ నుంచి మద్యం బయటికి వచ్చే సమయంలోనే దాని విలువపై ఎంత వ్యాట్‌ చెల్లించాలనేది బిల్లుపై స్పష్టంగా రాసి పోర్టల్‌లో నమోదు చేయాలి. ఇలా చేయకుండా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తనిఖీ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం రాష్ట్ర బేవరేజెస్‌ సంస్థలోని అధికారులకు తెలిసే జరుగుతోందా లేక సంస్థ కళ్లుగప్పి నేతలు, వ్యాపారుల సహకారంతో జరుగుతోందా అనేది సమగ్ర విచారణలో తేలుతుందని ప్రభుత్వానికి నివేదించారు. మరోవైపు మద్యం సీసాలపై వేసే లేబుళ్లు, ఇతర సర్వీసులపై విడిగా జీఎస్టీ చెల్లించాలి. ఇందులోనూ అక్రమాలు జరుగుతున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ గుర్తించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని