మార్చిలోనే వడగాలులు!

దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి.

Updated : 28 Mar 2024 07:10 IST

 నెలాఖరులో 40 డిగ్రీలు దాటే అవకాశం
వాతావరణంలో మార్పులే కారణం
అమెరికా శాస్త్రవేత్తల బృందం వెల్లడి

 ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. గతంలో మహారాష్ట్ర, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనే మార్చి నెలలో 40 డిగ్రీలు నమోదయ్యేవి. ప్రస్తుతం దేశమంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా సహా మొత్తం 9 రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటే అవకాశాలు కొంతమేర ఉన్నాయి. ఈ విషయాన్ని అమెరికా శాస్త్రవేత్తల బృందం ‘క్లైమేట్‌ సెంట్రల్‌’ వెల్లడించింది. ఈ బృందం 1970 నుంచి ఇప్పటివరకు భారతదేశంలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఉష్ణోగ్రతల తీరుతెన్నుల్ని విశ్లేషించింది. దీని ప్రకారం.. ఉత్తర భారతం సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో శీతాకాలంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 1970లతో పోలిస్తే జమ్మూకశ్మీర్‌లో 2.8, మిజోరంలో 1.9 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలోని 51 నగరాల్లో మార్చి ఆఖరి వారంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరే అవకాశాలున్నాయని అమెరికా శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. సాధారణంగా మార్చి నెలలో వడగాలులు రావడం చాలా అరుదు అని   ‘క్లైమేట్‌ సెంట్రల్‌’ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఆండ్య్రూ పర్షింగ్‌ పేర్కొన్నారు. అయితే గ్లోబల్‌ వార్మింగ్‌ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం మార్చిలోనూ వడగాలులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈసారి ఈ నెల ఆఖరి వారంలోనూ వడగాలులు వచ్చే అవకాశం ఉందన్నారు. వేసవి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు తగిన విధంగా సిద్ధం కావాలని సూచించారు.

ఎందుకిలా.. పరిష్కారమెలా?

ఉష్ణోగ్రతల్లో పెరుగుదల, వడగాలులకు వాతావరణ పరిస్థితుల్లో మార్పులే కారణం. కర్బన ఉద్గారాలతో వాతావరణం వేడెక్కుతోంది. దేశంలో సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పట్టణాలు, నగరాలు పెరగడం, వేగవంతమైన పారిశ్రామికీకరణ, కాలుష్య ఉద్గారాలు అధికం కావడం ఇందుకు కారణాలు. వాతావరణాన్ని చల్లబరచడమే సమస్యకు పరిష్కారం. ఇందుకోసం పచ్చదనం పెరగాలి. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని