తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!

స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది.

Updated : 28 Mar 2024 07:35 IST

 ప్రైవేటు ఫైనాన్షియర్లతోపాటు  కొనుగోలుదార్లకూ టోకరా
వెలుగులోకి సాహితీ సంస్థ మరో నిర్వాకం
రూ.323 కోట్లు నష్టపోయామన్న బ్యాంకు ఫిర్యాదుతో కేసు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఓ స్థిరాస్తి ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనుగోలు చేసిన వినియోగదారులతోపాటు రుణాలిచ్చిన బ్యాంకుకు తెలియకుండానే ప్రైవేటు ఫైనాన్షియర్లకు అవే ఫ్లాట్లను తాకట్టుపెట్టిన వైనం వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో తమకు రూ.వందల కోట్ల నష్టం వాటిల్లిందంటూ ఆ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బిల్డర్స్‌) కంపెనీ 2018 డిసెంబరులో ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌) నుంచి ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ పేరిట రూ.65 కోట్ల రుణం తీసుకుంది. ఇందుకోసం మాదాపూర్‌లో క్రిష్‌సపైర్‌ పేరిట ఉన్న తమ వెంచర్‌లోని 160 ఫ్లాట్లను ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు తాకట్టు పెట్టింది. అదే క్రమంలో ‘కార్తికేయ పనోరమ’ పేరిట రెసిడెన్షియల్‌ హౌసింగ్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు రుణం కోసం సికింద్రాబాద్‌ ఎస్‌డీ రోడ్‌లోని యూకో బ్యాంకును సాహితీ నిర్వాహకులు సంప్రదించారు. ఈ మేరకు బ్యాంకు.. ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ జారీచేసిన నిరభ్యంతర పత్రంతోపాటు లీగల్‌ ఒపీనియన్‌, వాల్యూయేషన్‌ల ఆధారంగా పలువురు ఫ్లాట్ల కొనుగోలుదారులకు 2019 ఆగస్టులో రుణాలు మంజూరు చేసింది. ఈ క్రమంలో 2021 నవంబరు వరకు కొనసాగిన ప్రాజెక్టు నిర్మాణ పనులు కోర్టు స్టే కారణంగా ఆగిపోయాయి. అనంతరం కొత్త రుణాల మంజూరును బ్యాంకు నిలిపివేసింది.

తప్పుడు పత్రాలతో మాయాజాలం!

ఈ నేపథ్యంలో 2022 ఆగస్టులో నవీన్‌, డీవీఎస్‌ సోమయాజులు, పీవీఎస్‌ శ్రీనివాస్‌, హేమ కుషాల్‌దాస్‌ అనే ప్రైవేటు ఫైనాన్షియర్లు యూకో బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. సాహితీ సంస్థ నిర్వాహకులు అప్పటికే తమ నుంచి రుణాలు తీసుకొన్నారని.. తప్పుడు పత్రాలు సృష్టించి ఇతరులకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సాహితీ నిర్వాహకులకు బ్యాంకు అధికారులు లేఖ రాశారు. దీనిపై స్పందించిన సాహితీ నిర్వాహకులు పెట్టుబడుల ఉద్దేశంతోనే ప్రైవేటు వ్యక్తుల నుంచి రుణాలు తీసుకొన్నామని తెలిపారు. 2022 సెప్టెంబరు 15 కల్లా అంతా సరిదిద్దుతామని పేర్కొన్నారు. అయితే గడువు ముగిసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సాహితీ నిర్వాహకులకు బ్యాంకు లీగల్‌ నోటీసు జారీచేసినా స్పందన లేకపోయింది. ఈ క్రమంలో బ్యాంకు చేపట్టిన అంతర్గత విచారణలో సాహితీ సంస్థ నిర్వాహకుల నిర్వాకం బహిర్గతమైంది. ఒకే ఫ్లాటును ప్రైవేటు ఫైనాన్షియర్లకు తాకట్టు పెట్టడంతోపాటు కొనుగోలుదారులకూ రిజిస్ట్రేషన్‌ చేసినట్లు వెల్లడైంది. పలు ఫ్లాట్ల విషయంలో ఇదే విధానాన్ని అనుసరించినట్లు తేలింది. ఇందుకోసం తప్పుడు పత్రాలను సృష్టించినట్లు గుర్తించారు. కొనుగోలుదారులు ఇచ్చిన సొమ్మునూ పక్కదారి పట్టించినట్లు వెల్లడైంది. తమకు రూ.323.64 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు బ్యాంకు ప్రతినిధులు సీసీఎస్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సాహితీ సంస్థ నిర్వాహకులు బూదాటి లక్ష్మీనారాయణ, బూదాటి పార్వతి, బూదాటి సాత్విక్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని