సంక్షిప్త వార్తలు (3)

ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఐఎన్‌టీయూసీ అనుబంధ ఎస్‌డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.

Updated : 28 Mar 2024 05:32 IST

2013 వేతన సవరణ బకాయిలు ఇవ్వాలి: ఎస్‌డబ్ల్యూయూ

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఐఎన్‌టీయూసీ అనుబంధ ఎస్‌డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది. సంఘం సెక్రటరీ జనరల్‌ హనుమంతు ముదిరాజ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సయ్యద్‌ మహమూద్‌ ఆర్టీసీ ఎండీని బుధవారమిక్కడ బస్‌భవన్‌లో కలిసి వినతిపత్రం ఇచ్చారు. వేతన సవరణ బకాయిలు విడుదలపై సీఎం ప్రకటన చేసి చాలా రోజులైందని గుర్తుచేశారు. వేతన సవరణకు సంబంధించిన బాండ్ల డబ్బులు పూర్తిగా రాలేదని ఆర్టీసీ ఎండీ చెప్పినట్లు ఎస్‌డబ్ల్యూయూ తెలిపింది. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన రూ.250 కోట్ల మొత్తాన్ని సర్దుబాటు చేసి ఉద్యోగుల బాండ్ల డబ్బులు చెల్లించాలని ఎస్‌డబ్ల్యూయూ నేతలు సజ్జనార్‌ని కోరారు.


టెట్‌ ఫీజు తగ్గించాలి

అంబర్‌పేట, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫీజును రూ. 200కు తగ్గించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. గతంలో రెండు పేపర్లకు కలిపి రూ.200 మాత్రమే ఉండేదని పేర్కొన్నారు. పోటీ పరీక్షల శిక్షణ కోసం రూ.వేల ఫీజులను కట్టి నిరుద్యోగులు ఇప్పటికే అప్పుల పాలయ్యారన్నారు.


సింగరేణిలో సమ్మెలపై నిషేధం పొడిగింపు

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి సంస్థలో సమ్మెలపై ఉన్న నిషేధాన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ఇంధనశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. నిత్యావసర సేవల నిర్వహణ చట్టం కింద ఈ సంస్థలో సమ్మెను నిషేధిస్తూ ప్రతి ఆరునెలలకోమారు ఇలా ఉత్తర్వులివ్వడం ఆనవాయితీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని