మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్‌ పాంక్రియాస్‌ సెంటర్‌

క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్‌ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్‌ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్‌ పాంక్రియాస్‌ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు.

Updated : 28 Mar 2024 05:30 IST

ఆసియాలోనే తొలిసారిగా ఏఐజీలో ఏర్పాటు
ఈ కేంద్రంలో భారతీయ రోగుల కోణంలో పరిశోధనలు
ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్‌ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్‌ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్‌ పాంక్రియాస్‌ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. మధుమేహంపై అధ్యయనంతో పాటు కొత్త చికిత్స మార్గాలను గుర్తించేందుకు ఈ కేంద్రం పరిశోధనలు సాగిస్తుందని ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘కేంద్రంలోని బయోటెక్నాలజీ విభాగం(డీబీటీ) వెల్కం ట్రస్ట్‌ పరిశోధన గ్రాంటుతో ప్రాజెక్టు చేపడుతున్నాం. అమెరికాకు చెందిన ఎమోరీ గ్లోబల్‌ డయాబెటిస్‌ రీసెర్చ్‌ సెంటర్‌, వాండర్‌బిల్ట్‌ డయాబెటిస్‌ సెంటర్‌, బెంగళూరుకు చెందిన సెయింట్‌ జాన్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లతో కలిసి పరిశోధనలు చేపడుతున్నాం. దేశంలో 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. దేశంలో డయోబెటిస్‌పై పరిశోధన చాలా పరిమితంగా ఉంది. రోగుల వయసు, శరీర బరువు, జన్యువులు, జీవనశైలి, ఇన్సులిన్‌ నిరోధకత, ఇతర శారీరక అంశాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకం ఔషధాలు ఉపయోగిస్తున్నాం. ఇకముందు మధుమేహానికి కారణాలు, సమస్యలను భారతీయ రోగుల కోణంలో విశ్లేషించడం, పరిష్కారాలను చూపడం ఈ పరిశోధనల లక్ష్యం. భారతీయులకు ప్రత్యేకమైన జన్యు, ఆహార, జీవనశైలిలకు అనుగుణంగా నూతన చికిత్స విధానాలకు మార్గదర్శకాలను పరిశోధకులు సూచిస్తారు’’ అని నాగేశ్వరరెడ్డి వివరించారు.

ప్రాజెక్టు ముఖ్య పరిశోధకులు డాక్టర్‌ ఎం.శశికళ మాట్లాడుతూ పరిశోధనల్లో భాగంగా ఎండోక్రైనాలజిస్టులు, పాంక్రియాలజిస్టులు, మాలిక్యులర్‌ బయాలజిస్టులు, బయో ఇన్ఫర్మేటిషియన్‌లతో కూడిన ఒక బృందాన్ని ఎంపిక చేయడంతోపాటు ఇతర సంస్థలతో ముందుకు సాగుతామని చెప్పారు. భారతీయుల్లో ఇన్సులిన్‌ లోపాలకు సంబంధించి మెకానిజం(పాథోజెనిసిస్‌)పై అధ్యయనం చేస్తామన్నారు. డాక్టర్‌ రెడ్టీస్‌ ల్యాబ్‌ కోఛైర్మన్‌ ఎండీ జీవీ ప్రసాద్‌, మోహన్స్‌ డయాబెటిస్‌ సెంటర్‌ ఫౌండర్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వి.మోహన్‌, ఎమోరీ గ్లోబల్‌ డయాబెటిస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కె.ఎం.వెంకట్‌ నారాయణ్‌, వాండర్‌బిల్ట్‌ డయాబెటిస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఆల్విన్‌ సీ పవర్స్‌, సెయింట్‌ జాన్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ అనురా వీ కుర్పాద్‌, ఎన్‌ఐఎన్‌ విశ్రాంత డైరెక్టర్‌ డాక్టర్‌ బి.శశికేరన్‌, ఏఐజీ వైస్‌ఛైర్మన్‌ పీవీఎస్‌ రాజు, డైరెక్టర్‌ డాక్టర్‌ జీవీ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని