ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్‌రావుల పోలీస్‌ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్‌ చేసింది.

Published : 28 Mar 2024 03:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్‌రావుల పోలీస్‌ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్‌ చేసింది. వీరిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని హైదరాబాద్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నిందితుల తరఫున కౌంటర్‌ దాఖలు చేయడంతో బుధవారం న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ఏ స్థాయి వరకు వెళుతుందనేది ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ దందాకు ఆదేశించిందెవరు..? దీని వెనకున్న సూత్రధారులెవరు..? అనే అంశానికి ప్రాధాన్యం సంతరించుకొంది. సూత్రధారులెవరో కనిపెట్టే దిశగా దర్యాప్తు ముందుకు సాగాలంటే విశ్రాంత అధికారులతోపాటు మీడియా సంస్థ నిర్వాహకుడిని విచారించాల్సి ఉందని చెబుతున్నారు. మరోవైపు ఈ దందాలో క్షేత్రస్థాయి ఆపరేషన్లపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. ఎస్‌ఐబీలో ప్రణీత్‌ బృందంలో పనిచేసిన సిబ్బందిని విచారించి వివరాలు రాబడుతుండటంతోపాటు క్షేత్రస్థాయి ఆపరేషన్లలో ఎవరి పాత్ర ఎంత ఉందని ఆరా తీస్తున్నారు. అదనపు ఎస్పీల సస్పెన్షన్‌కు సంబంధించి పోలీస్‌ శాఖ నుంచి ఇంకా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి నివేదిక అందనట్లు తెలిసింది. ఇప్పటికే రెండు రోజులుగా వారిద్దరు జైల్లో ఉండటంతో ఆ నివేదిక అందాక సస్పెన్షన్‌ విధించే అవకాశం కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని