సంక్షిప్త వార్తలు (3)

ఫోన్‌ ట్యాపింగ్‌ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్‌, నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి గురువారం డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు.

Updated : 29 Mar 2024 05:39 IST

ఫోన్‌ ట్యాపింగ్‌పై డీజీపీకి ఫిర్యాదు

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఫోన్‌ ట్యాపింగ్‌ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్‌, నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి గురువారం డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హుజురాబాద్‌ ఉపఎన్నికలో అప్పటి మంత్రి హరీశ్‌రావు పోలీసు ఇంటెలిజెన్స్‌ అధికారులతో నాయకుల ఫోన్లు ట్యాపింగ్‌ చేయించారని ఆరోపించారు. ట్యాపింగ్‌ వ్యవహారంపై లోతుగా విచారణ చేసి బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. తన ఫోనూ ట్యాపింగ్‌ చేశారంటూ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్‌ డీజీపీ రవిగుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. ట్యాపింగ్‌ దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.


డీఎస్సీ-1998 అభ్యర్థులకు న్యాయం చేయాలి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ-1998 ఎస్‌జీటీ మొదటి జాబితా అభ్యర్థులకు న్యాయం చేయాలని సంబంధిత సంఘం ప్రతినిధులు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కోరారు. సంఘం నేతలు గోపాలరావు తదితరులు గురువారం ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. 2,163 మంది బాధితులకు ఉద్యోగాలు లభించేందుకు సహకరించాలన్నారు.

రాష్ట్రంలోని అంధ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత సంఘం గురువారం పీఆర్సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను కోరింది. సంఘం అధ్యక్షుడు మల్లేశం, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌, నిర్వహణ కార్యదర్శి అనిల్‌కుమార్‌లు గురువారం శివశంకర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.


ఉపాధి హామీలో వికారాబాద్‌ ప్రథమం

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ అమలులో 2023-24 ఆర్థిక సంవత్సరానికి వికారాబాద్‌ జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించిందని కార్యక్రమ జిల్లా అధికారి శ్రీనివాస్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో అత్యధిక కూలీలకు, కుటుంబాలకు 100 రోజుల పని కల్పించినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఈ పథకం కింద కూలీలకు రూ.114.83 కోట్లు, మెటీరియల్‌కు రూ.75.93 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ప్రగతి సాధించడంలో భాగస్వాములైన క్షేత్ర సహాయకులు, ఇతర సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అభినందించారని వివరించారు.




 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని