హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య ప్రమాణం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్‌ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ప్రమాణం చేయించారు.

Published : 29 Mar 2024 04:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్‌ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ప్రమాణం చేయించారు. అంతకుముందు రాష్ట్రపతి జారీ చేసిన బదిలీ ఉత్తర్వులను, ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యతలను ప్రధాన న్యాయమూర్తికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రిజిస్ట్రార్‌ జనరల్‌ చదివి వినిపించారు. జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య కలకత్తా హైకోర్టు నుంచి తెలంగాణ ఉన్నత న్యాయస్థానానికి బదిలీపై వచ్చిన విషయం విదితమే. 1967 అక్టోబరు 27న జన్మించిన జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య కలకత్తాలో పాఠశాల విద్య చదివారు. జాదవ్‌పుర్‌ విశ్వవిద్యాలయం నుంచి బీఏ ఆనర్స్‌, కలకత్తా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. రోటరీ అంబాసిడర్‌ స్కాలర్‌షిప్‌తో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం చేశారు. 1997లో కలకత్తా బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ అయ్యారు. కలకత్తాతోపాటు దిల్లీ, పట్నా, హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. 2017 సెప్టెంబరు 21న కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 సెప్టెంబరు 16న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో మార్చి 21న ఆమెను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి.నాగేశ్వరరావు, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య కుటుంబసభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని