పర్యాటకులను వేధించొద్దు

తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది.

Published : 29 Mar 2024 02:48 IST

రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. దీని ప్రకారం.. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదును వెంట ఉంచుకోకూడదు. తమిళనాడు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు నిర్వహించిన తనిఖీల్లో పర్యాటకుల నుంచి అధికారులు సొమ్ము స్వాధీనం చేసుకోవటంతో పాటు కేసులు నమోదు చేశారు. తమకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని చెప్పినా అధికారులు ససేమిరా అన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి పలువురు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు ఈసీఐ లేఖ రాసింది. ‘‘ప్రలోభాలను నివారించాలన్నది ఎన్నికల సంఘం లక్ష్యం. అయితే.. ప్రయాణ తదితర అవసరాల కోసం చిన్న మొత్తాల్లో వెంట తెచ్చుకున్న పర్యాటకులను విచారణ పేరిట వేధించటం మంచిది కాదు. తనిఖీల సందర్భంగా పర్యాటకులు ఎవరు? రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎవరు? అన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

అన్ని జిల్లాల్లో గ్రీవెన్స్‌ కమిటీలు

ఎన్నికల సందర్భంగా అన్ని జిల్లాల్లో జిల్లా గ్రీవెన్స్‌ కమిటీలను ఏర్పాటు చేయాలి. నగదు, ఇతర వస్తువులు పట్టుకున్న సందర్భాల్లో వాటికి సంబంధించిన ఆధారాలను సంబంధితులు చూపితే వారికి త్వరగా న్యాయం చేసేలా ఈ కమిటీలు పనిచేయాలి. రోజుకో ప్రాంతంలో ఈ కమిటీ అందుబాటులో ఉండాలి. ఎప్పుడు ఎక్కడ అందుబాటులో ఉంటుందో ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. ఈ కమిటీలు వేగంగా నిర్ణయాలు తీసుకునేలా అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలి. కేసులను త్వరగా పరిష్కరించకుండా పెండింగ్‌లో పెడుతున్న కమిటీల విషయంలో కఠినంగా వ్యవహరించాలి’’ అని లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని