‘సాహితీ’ డబుల్‌ దందాపై పోలీసుల ఆరా

కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్‌ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Published : 29 Mar 2024 02:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్‌ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కస్టమర్లతో విక్రయ ఒప్పందం కుదుర్చుకున్న ఫ్లాట్లనే తిరిగి ప్రైవేటు ఫైనాన్షియర్లకు తాకట్టు పెట్టడం లేదా విక్రయించడం ఎలా సాధ్యమైందనే కోణంలో ఆరా తీస్తున్నారు. నాలుగైదేళ్ల క్రితం ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ల కోసం కస్టమర్లు నవీన్‌కుమార్‌, పీవీఎస్‌ శ్రీనివాస్‌, డీవీఎస్‌ సోమయాజులు, హేమ తదితరులు కొంత డబ్బు చెల్లించి సాహితీ సంస్థ నిర్వాహకులతో సేల్‌ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. అనంతరం సాహితీ సంస్థ నిర్వాహకుల సూచనతోనే యూకో బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారు. ఆ తర్వాత కొందరు కస్టమర్లు రుణ వాయిదాల్ని సైతం చెల్లిస్తూ వచ్చారు. అయితే హైకోర్టు స్టే కారణంగా ఫ్లాట్ల నిర్మాణం ఆగిపోయిన నేపథ్యంలో సాహితీ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఫ్లాట్ల కొనుగోలుదారులు ఇదే విషయాన్ని 2022 ఆగస్టులో యూకో బ్యాంకు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో బ్యాంకు అధికారులు ఇటీవలే హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. జీహెచ్‌ఎంసీ, రెరా అనుమతులు రాకముందే సాహితీ నిర్వాహకులు ఆ ఫ్లాట్లను ఎలా తాకట్టు పెట్టారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఫైనాన్షియర్లకు తాకట్టు పెట్టిన ఫ్లాట్ల వివరాలు ఈసీల్లో ఎందుకు కనిపించలేదనే కోణంలోనూ విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని