గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు

గురుకులాల్లో డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్‌, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 29 Mar 2024 02:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: గురుకులాల్లో డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్‌, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు 2017లో వెలువరించిన తీర్పు మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. గత ఏడాది బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేసి అన్నీ ఒకేసారి భర్తీ చేయడంతో ఒకే వ్యక్తి రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వాటిలో ఒక దాన్ని ఎంచుకుని మిగిలినవి వదులుకున్నారు. అలా ఏర్పడిన ఖాళీల్లో మెరిట్‌ ప్రకారం తమను భర్తీ చేయాలని కోరుతూ విజయ్‌మనోహర్‌తోపాటు మరో 20 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉన్నతస్థాయి పదవుల భర్తీ తర్వాత కిందిస్థాయి నియామకాలను చేపట్టాల్సి ఉందని, అలాకాకుండా అన్నింటినీ ఒకేసారి భర్తీ చేయడంతో చాలా పోస్టులను మెరిట్‌ అభ్యర్థులు వదులుకున్నారన్నారు. తద్వారా 2 వేలకుపైగా పోస్టులు ఖాళీ అయినట్లు పేర్కొన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను ఏప్రిల్‌ 22వ తేదీకి వాయిదా వేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నియామకాలను పరిశీలించాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని