విత్తన లైసెన్సింగ్‌ విధానంలో మార్పులు

తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్‌ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Published : 29 Mar 2024 03:37 IST

కంపెనీల ప్రతినిధులతో మంత్రి తుమ్మల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్‌ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలం సీజన్‌లో పంటల సాగు వివరాలు, విత్తన లభ్యతపై గురువారం ఆయన తన కార్యాలయంలో విత్తన కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పత్తి రెండో ప్రధాన పంటగా ఉందని, వచ్చే వానాకాలం కూడా దాదాపు 60.53 లక్షల ఎకరాలలో సాగు కావచ్చని, దానికిగాను 121.06 లక్షల ప్యాకెట్లు అవసరమైనందున వాటిని సరఫరా చేయాలన్నారు. మొక్కజొన్న ఇతర విత్తనాల సరఫరాలోనూ సహకరించాలని మంత్రి కోరారు.

సెస్‌ను బలోపేతం చేయాలి

సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘా(సెస్‌)న్ని ప్రభుత్వం బలోపేతం చేయాలని వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌, సెస్‌ ఛైర్మన్‌ చిక్కాల రామారావు, వైస్‌ ఛైర్మన్‌ దేవరకొండ తిరుపతి తదితరులు మంత్రి తుమ్మలను కోరారు. గురువారం ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2,97,708 సభ్యులతో, రూ.6.14 కోట్ల వాటాధనం గల సెస్‌ను మూసివేయాలని లేదా ఎన్‌డీపీసీఎల్‌లో విలీనం చేయాలని ఈఆర్‌సీ ప్రతిపాదించిందన్నారు. దానిని ప్రభుత్వం తిరస్కరించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని