తగ్గిపోతున్న యువ జనాభా!

దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది.

Published : 29 Mar 2024 03:40 IST

దక్షిణాది రాష్ట్రాల్లోనే అధికం
తెలంగాణ యువతలో నిరుద్యోగ రేటు 21.71 శాతం
ఐఎల్‌వో భారత ఉపాధి నివేదిక-2024లో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. ఇప్పటివరకు విద్యావంతులు, చదువుకున్న యువతతో మెరుగైన ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న ఈ రాష్ట్రాల్లో భవిష్యత్తులో డిమాండ్‌కు తగినంత యువ కార్మిక బలగం అందుబాటులో ఉండదని హెచ్చరించింది. ప్రపంచ కార్మిక సమాఖ్య(ఐఎల్‌వో).. ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌’తో కలిసి ‘భారత ఉపాధి నివేదిక-2024’ను తాజాగా విడుదల చేసింది. తెలంగాణలో 15-29 ఏళ్ల వయసున్న వారిలో చదువుకున్న యువత 77.7 శాతం ఉన్నప్పటికీ వారికి సరిపడే సంఖ్యలో ఉద్యోగాల్లేవని, చాలా మంది ఉపాధికి దూరంగా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. రాష్ట్ర యువతలో నిరుద్యోగ రేటు 14.19 శాతం నుంచి 21.71 శాతానికి పెరిగిందని.. మహిళా కార్మిక బలగం వాటా తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. యువకుల్లో నిరుద్యోగ రేటు 12.96 శాతం నుంచి 18.34 శాతానికి చేరితే.. యువతుల్లో ఏకంగా 17.65 శాతం నుంచి 30.35 శాతానికి పెరిగిందని నివేదిక వెల్లడించింది.

2039 నాటికి తెలంగాణలో 15-29 ఏళ్ల యువ జనాభా తగ్గనుంది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ తగ్గుదల ఎక్కువ. ఇప్పటికే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో యువ జనాభాలో స్వల్ప తగ్గుదల నమోదైంది. రానున్న రోజుల్లో వృద్ధుల జనాభా పెరగనుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతానికి యువ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ రానున్న దశాబ్దాల్లో అక్కడా ఈ జనాభా రేటు తగ్గనుంది.

నివేదికలోని ఇతర అంశాలు..

  • రాష్ట్రంలో పురుషుల ఉపాధి సూచీలో అభివృద్ధి కనిపించింది. 2005లో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ.. 2022 నాటికి రెండో స్థానానికి చేరుకుంది. అయితే, మహిళా ఉపాధి సూచీలో నాలుగో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది.
  • 15 ఏళ్ల పైబడిన పనివారల రేటు 69.40 శాతం నుంచి 56.31 శాతానికి తగ్గింది. 2005లో తొలిస్థానంలో ఉంటే.. 2022 నాటికి మూడో స్థానానికి దిగజారింది.
  • ఉపాధి, విద్య, శిక్షణకు దూరంగా ఉంటున్న యువత సంఖ్య పెరుగుతోంది. 2005లో 17.91 శాతం ఉంటే.. ప్రస్తుతం 27.54 శాతానికి పెరిగింది.  
  • యువతలో కంప్యూటర్‌ నైపుణ్యాలు తక్కువగా ఉన్నాయి. సగానికిపైగా యువతకు కంప్యూటర్‌లో ఫోల్డర్‌లు క్రియేట్‌ చేయడం, ఈ-మెయిల్‌ అటాచ్‌మెంట్‌ చేయడం రావట్లేదు. 14.27 శాతం మంది మాత్రమే పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ తయారు చేసే నైపుణ్యాలు కలిగి ఉన్నారు.
  • తాత్కాలిక కార్మికులకు వేతనాల్లో పెరుగుదల తక్కువగా ఉంది. పురుషులకు 2005లో నెలకు రూ.1,263తో జాతీయ స్థాయిలో 16వ స్థానంలో తెలంగాణ ఉండేది. 2019 నాటికి రూ.8,795తో ఆరో స్థానంలో నిలిచింది. ఆ తరువాత 2022లో నెలకు రూ.10,175తో పదో స్థానానికి పడిపోయింది. మహిళల వేతనాలు మరీ తక్కువగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని