3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు.

Updated : 29 Mar 2024 05:34 IST

జిల్లాల వారీగా లక్ష్యం ఖరారు
అత్యధికంగా నిజామాబాద్‌లో 6.24 లక్షల టన్నులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. తర్వాత స్థానాల్లో జగిత్యాల, నల్గొండ, కామారెడ్డి, మెదక్‌, యాదాద్రి జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో 7,149 కొనుగోలు కేంద్రాల ద్వారా 75.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనాలన్నది పౌరసరఫరాల సంస్థ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కేంద్రాలు ప్రారంభం కావాల్సి ఉంది. నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో మార్చి మొదటివారంలోనే వరి కోతలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో ఈ రెండు జిల్లాల్లో ముందే ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం అనుమతించింది. ఈ జిల్లాల్లో మొత్తం 836 కొనుగోలు కేంద్రాలకు గాను అవసరమైన ప్రాంతాల్ని గుర్తించి 19 కేంద్రాలను గురువారం ప్రారంభించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో కొనుగోలు కేంద్రాలను ఎన్నికల నియమావళికి అనుగుణంగానే ప్రారంభించాలని మూడ్రోజుల క్రితం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. దీంతో నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మేడ్చల్‌, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల సంఖ్య తక్కువగా ఉంది. మొత్తం కలిపి ఈ సంఖ్య 257. ఈ జిల్లాల్లో ధాన్యం ఉత్పత్తి తక్కువగా ఉండటం ఒక కారణంగా ఉంది. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు ధాన్యం రవాణా వాహనాల టెండర్లను, గన్నీ టెండర్లను ఖరారు చేసేందుకు అనుమతి కోసం ఎన్నికల కమిషన్‌కు పౌరసరఫరాల సంస్థ లేఖ రాసింది. ఎండల తీవ్రత నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో తాగునీటి సరఫరా, టెంట్లు, చలువ పందిళ్లు వంటి ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ కలెక్టర్లను ఆదేశించారు.

ఇతర జిల్లాల్లో...

సూర్యాపేట 3,69,626, కరీంనగర్‌ 3,64,525, సిద్దిపేట 3,64,525, సిరిసిల్ల 3,12,451, పెద్దపల్లి 3,12,450, నాగర్‌కర్నూల్‌ 2,31,400, జనగామ 2,18,716, వనపర్తి 2,08,300, నిర్మల్‌ 2,05,473, సంగారెడ్డి 1,96,519, మంచిర్యాల 1,82,044, మహబూబాబాద్‌ 1,77,075, హనుమకొండ 1,67,923, వరంగల్‌ 1,56,225, నారాయణపేట 1,41,238, మహబూబ్‌నగర్‌ 1,29,746, భూపాలపల్లి 1,27,038, ఖమ్మం 1,24,980, వికారాబాద్‌ 1,24,303, గద్వాల 1,04,150, ములుగు 88,528, కొత్తగూడెం 67,697, రంగారెడ్డి 41,660, ఆసిఫాబాద్‌ 36,510, మేడ్చల్‌ 26,037, ఆదిలాబాద్‌ 655 టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని