టూరు.. ధరలతో బేజారు!

వేసవిలో పర్యాటకం పరుగులు తీస్తోంది. ఏడాది అంతా ఉద్యోగ, వ్యాపార జీవితంలో తీరిక లేకుండా గడిపినవాళ్లు పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు.

Published : 30 Mar 2024 05:37 IST

వేసవిలో ఊపందుకుంటున్న పర్యాటకం
హోటళ్లు, విమాన, రైలు టికెట్లకు డిమాండ్‌
గతేడాది కంటే భారీగా పెరిగిన విమానయాన ఖర్చులు

  •  హైదరాబాద్‌ నుంచి లద్దాఖ్‌కు ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రయాణానికి వారం ముందు ప్రయత్నిస్తే ఒకరికి రానుపోను కలిపి గతేడాది దాదాపు రూ.11 వేలకే టికెట్లు దొరికాయి. ఇప్పుడా ఖర్చు ఒకరికి కనీసం రూ.20 వేల పైమాటే. అదే మే రెండో వారంలో ప్రయాణానికి అయితే రానుపోను టికెట్ల ధర ఇప్పుడే రూ.35 వేలకు పైగా పలుకుతోంది. ప్రయాణ తేదీ దగ్గర పడే కొద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. అదే శ్రీనగర్‌కు రానుపోను టికెట్ల ఖర్చు ఇప్పుడే రూ.పాతిక వేలు దాటేసింది. హైదరాబాద్‌ నుంచి బాగ్‌డోగ్రా, గువాహటికి రానుపోను గతేడాది రూ.ఏడెనిమిది వేలకు దొరికితే.. ఇప్పుడా టికెట్ల ఖర్చు ఒక్కరికే 16-17 వేలవుతోంది.

  •  వేసవిలో గోవాకు పర్యాటకుల రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం గోవాలోని రెండు ఎయిర్‌పోర్టులు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. అక్కడి రిసార్టుల్లో బుకింగ్‌లు గతేడాది 50 శాతంగా ఉంటే ఇప్పుడు 90 శాతం వరకు అవుతున్నట్లు అంచనా. మంచు ప్రదేశాలకు విమాన టికెట్ల ధరలు భారీగా ఉండటంతో అంత బడ్జెట్‌ భరించలేని పర్యాటకులు గోవా వంటి బీచ్‌ స్టేషన్ల బాట పడుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌: వేసవిలో పర్యాటకం పరుగులు తీస్తోంది. ఏడాది అంతా ఉద్యోగ, వ్యాపార జీవితంలో తీరిక లేకుండా గడిపినవాళ్లు పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు. స్వస్థలాలకు సమీపంలో కాకుండా దూరప్రాంతాలు, అంతర్రాష్ట్ర పర్యాటకానికి ఆసక్తి చూపుతున్నారు. వారం నుంచి పర్యాటకం ఒక్కసారిగా జోరు అందుకుంది. హోటళ్లలో గదుల అద్దెలు పెరిగాయి. విమాన టికెట్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రైళ్లలో రిజర్వేషన్‌ దొరకట్లేదు. ఏప్రిల్‌, మే నెలల్లో పర్యాటకం మరింత జోరందుకుంటుందని పర్యాటక ఆపరేటర్లు చెబుతున్నారు.

హిల్‌స్టేషన్లకు వెళ్లేందుకు మొగ్గు

వేసవి కావడంతో పర్యాటకులు చల్లని ప్రదేశాలకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో మంచు ఉండే ప్రాంతాలకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీంతో కశ్మీర్‌లోని శ్రీనగర్‌, గుల్మార్గ్‌, పహల్గామ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని శిమ్లా, మనాలి, సిక్కింలో గ్యాంగ్‌టక్‌, నాథులాపాస్‌కు అధిక డిమాండ్‌ ఉంది. దక్షిణాదిలో ఊటీ, కొడైకెనాల్‌, మున్నార్‌, కూర్గ్‌ వంటి హిల్‌స్టేషన్లకు ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు. వీటికి దగ్గరలో ఉండే కోయంబత్తూర్‌, మదురై, కొచ్చి, బెంగళూరు విమానాశ్రయాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది.

అటు మంచు.. ఇటు తులిప్‌ అందాలు

కశ్మీర్‌లో ప్రధాన ఆకర్షణ గుల్మార్గ్‌, సోన్‌మార్గ్‌, పహల్గావ్‌లోని మంచుకొండలు అయితే మరో ముఖ్య ఆకర్షణ శ్రీనగర్‌లోని తులిప్‌ గార్డెన్‌. కశ్మీర్‌లో చెట్లు, మొక్కలు అధికంగా పుష్పించే కాలం ఏప్రిల్‌ మొదటివారం. తులిప్‌ ఫెస్టివల్‌ కొద్దిరోజుల క్రితమే మొదలైంది. అందమైన తులిప్‌ పుష్పాలు నెలరోజులే కనిపిస్తాయి. దీంతో అటు మంచుకొండలు చూసేందుకు, ఇటు తులిప్‌ గార్డెన్‌ను వీక్షించేందుకు కశ్మీర్‌కు పర్యాటకం పోటెత్తుతోంది. మరోవైపు సాహస పర్యాటకం చేసేవాళ్లు లద్దాఖ్‌కు పెద్దఎత్తున వెళ్తున్నారు. హైదరాబాద్‌ సహా తెలంగాణలోని ప్రధాన స్టేషన్ల నుంచి అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్లు అయిపోయాయి.


అప్పటికప్పుడు వెళ్తే ఇబ్బందే

సతి, ఇతర ముందస్తు ఏర్పాట్లు లేకుండా నేరుగా పర్యాటక ప్రదేశాలకు వెళ్తే ఇబ్బందే. విమాన టికెట్ల ధరలు కశ్మీర్‌కు రెట్టింపు, ఇతర రూట్లకు 30-45 శాతం పెరిగాయి. రద్దీతో గోవా రిసార్టుల్లో వసతి ధరలు 20-25 శాతం పెరిగాయి. గదుల అద్దె 50 శాతం పైనే పెరిగింది. మంచు ప్రాంతాల్లో గదులు దొరకట్లేదు. నేరుగా వెళ్లినవాళ్లు వాహనాల్లోనే నిద్రించాల్సిన పరిస్థితులున్నాయి. ఊటీ వంటి హిల్‌స్టేషన్లలో రద్దీ పెరిగి పెద్ద వాహనాల (10 సీట్లపైనున్నవి)ను అనుమతించట్లేదు.

 సుధా చంద్రమౌళి, ది రాయల్‌ టూరిజం, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని