92.68 శాతం మందికి రైతుబంధు నిధుల విడుదల

తెలంగాణలో 2023-24 యాసంగి సీజన్‌ కోసం శుక్రవారం వరకు 64,75,819 (92.68) శాతం మందికి రైతుబంధు నిధులను విడుదల చేశామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Published : 30 Mar 2024 05:37 IST

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఈనాడు,హైదరాబాద్‌: తెలంగాణలో 2023-24 యాసంగి సీజన్‌ కోసం శుక్రవారం వరకు 64,75,819 (92.68) శాతం మందికి రైతుబంధు నిధులను విడుదల చేశామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క సంవత్సరం రైతుబంధు నిధులనూ 3 నెలల కంటే తక్కువ రోజుల్లోనే జమ చేయలేదని ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినా రైతుల సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రుణమాఫీ విధివిధానాల రూపకల్పనకు కసరత్తు

కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అమలు కోసం రిజర్వుబ్యాంకు, ఇతర బ్యాంకులతో కలిసి విధివిధానాల రూపకల్పనకు కసరత్తు చేస్తున్నామని ప్రకటించారు. ‘ప్రస్తుత 2023-2024 సంవత్సరంలో వర్షపాతం లోటు ఏర్పడింది. ఫలితంగా సాగునీటి రిజర్వాయర్లలో, చెరువుల్లో నీరు తగ్గుతోంది. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోరు బావులు ఎండిపోతున్నాయి. సాగు నీరందక కొన్ని జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించే బాధ్యతను వ్యవసాయశాఖకు వేగంగా అప్పగించాం. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల నష్టపరిహారం అందిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టులో, కీలకమైన మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవడం వల్ల ఉన్న కొద్దిపాటి నీళ్లను కిందికి వదిలేయాల్సి రావడం రైతులకు యాసంగిలో శాపంగా మారింది. కొత్తగా నీళ్లను ఎత్తి పోయలేని పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా మారాయి. ప్రస్తుతం రిజర్వాయర్లలోని నీళ్లను ప్రజల తాగునీటి అవసరాల కోసం పొదుపుగా వినియోగిస్తున్నాం.

పంటల బీమా అమలు చేస్తాం

ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం వల్ల రైతులు నష్టపోరాదని.. వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి పంటల బీమా పథకం అమలు చేయబోతున్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమ్మతి తెలిపాం. కొత్త సాంకేతికతను వాడుతూ పంటల బీమా పరిహారం క్లెయిమ్‌లు సత్వరమే చెల్లించే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది’ అని తుమ్మల తెలిపారు. ఇప్పటికైనా విపక్ష నేతలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని అవగాహనతో మాట్లాడితే అది వారికి గౌరవప్రదంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని