‘సీకెంట్‌ పైల్‌’ పద్ధతికే మొగ్గు ఎందుకు?

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజీల డిజైన్‌లో సీకెంట్‌ పైల్‌ కటాఫ్‌ వాల్‌ పద్ధతి ఎలా ముందుకు వచ్చింది? ప్రతిపాదన వచ్చిన వెంటనే వేగంగా ఎలా కార్యరూపం దాల్చింది?

Published : 30 Mar 2024 05:37 IST

దానికి అంత వేగంగా ఎలా కార్యరూపమిచ్చారు?
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై ఎన్‌డీఎస్‌ఏ అధ్యయనం

ఈనాడు హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజీల డిజైన్‌లో సీకెంట్‌ పైల్‌ కటాఫ్‌ వాల్‌ పద్ధతి ఎలా ముందుకు వచ్చింది? ప్రతిపాదన వచ్చిన వెంటనే వేగంగా ఎలా కార్యరూపం దాల్చింది? సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) సీకెంట్‌తో పాటు ఆర్‌.సి.సి. డయాఫ్రం ఇచ్చినా సీకెంట్‌ పైల్స్‌ కటాఫ్‌ వైపు ప్రాజెక్టు ఇంజినీర్లు మొగ్గు చూపడానికి కారణాలేమిటన్న అంశాలపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల బృందం లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి గుత్తేదారులు, ప్రాజెక్టు ఇంజినీర్లు, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నేతృత్వంలోని హైపవర్‌ కమిటీ, ప్రభుత్వం.. ఇలా అందరి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, సమావేశాల నిర్ణయాలకు సంబంధించిన మినిట్‌్్స కావాలని నిపుణుల కమిటీ కోరింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన సాంకేతిక అంశాలపై 2016 అక్టోబరు 22న జరిగిన సమావేశంలో తొలుత చర్చించగా, తాము సీకెంట్‌ పైల్‌ పద్ధతిని మూడు బ్యారేజీల్లో అవలంబించాలని నిర్ణయించుకున్నట్లు 2017 ఏప్రిల్‌ 19న కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌.. సీడీఓ చీఫ్‌ ఇంజినీర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. అయితే అన్నారం బ్యారేజీ నిర్మాణ సంస్థ ఆప్కాన్స్‌ 2017 జనవరి 16న సంబంధిత ఇంజినీర్‌కు పంపిన లేఖలో.. జనవరి 9న జరిగిన నీటిపారుదల శాఖ సమావేశంలో సీకెంట్‌ పైల్‌ కటాఫ్‌ వాల్‌ పద్ధతిని అనుసరించాలని నిర్ణయించినట్లు పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఇటీవల పర్యటనలో లోతుగా చర్చించిన నిపుణుల కమిటీ, దీనిపై నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కారణాలపై వివరాలు సేకరిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది.

సంబంధిత వివరాలు

  • 2016 అక్టోబరు 22న ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (పరిపాలన) ఛైర్మన్‌గా హైపవర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఈఎన్‌సీ జనరల్‌, సీడీఓ, కాళేశ్వరం, హైడ్రాలజీ విభాగం చీఫ్‌ ఇంజినీర్లు, హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌, కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్‌కు చెందిన శంభూ ఆజాద్‌ సభ్యులుగా ఉన్నారు. బోర్‌వెల్‌ డేటా, నేల స్వభావానికి సంబంధించిన పరీక్షలను పరిగణనలోకి తీసుకొని రాఫ్ట్‌, కటాఫ్‌ వాల్‌పై నిర్ణయం తీసుకోవాలనుకున్నారు.
  • 2017 జనవరి 11న సీడీఓ చీఫ్‌ ఇంజినీర్‌.., కాళేశ్వరం సీఈ(రామగుండం)కి లేఖ రాశారు. సీడీఓ ప్రతిపాదించిన షీట్‌ పైల్స్‌కు మేడిగడ్డ బ్యారేజి నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ కన్సల్టెంట్‌లు.. నిర్మాణ ప్రాంతాన్ని బట్టి ఈ పద్ధతి సరిపోదని చెప్పారు. ఇక మిగిలింది ఆర్‌.సి.సి. డయాఫ్రం కటాఫ్‌కు వెళ్లడం లేదా ఎల్‌అండ్‌టీ అభిప్రాయపడినట్లుగా సీకెంట్‌ పైల్‌ కటాఫ్‌ పద్ధతిని అనుసరించడం. నిర్మాణస్థలం వద్ద పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని నిర్ణయించాలి. దీంతోపాటు ఆర్‌.సి.సి. కట్‌ ఆఫ్‌ డయాఫ్రం, సీకెంట్‌ పైల్‌ కటాఫ్‌లకు సంబంధించిన రెండు డ్రాయింగులను జత చేస్తున్నాం. సబ్‌ సాయిల్‌ ఇన్వెస్టిగేషన్‌ పూర్తయిన తర్వాత బ్లాకుల వారీగా డ్రాయింగులు ఇస్తాం. తదుపరి ఏ పద్ధతి సరైనదనే దానిపై సమగ్రంగా అధ్యయనం జరగాలి. బ్యారేజీ వెడల్పుతో పాటు గ్రౌండ్‌ లెవల్‌ వివరాలు అందజేయాలి. ఏ కటాఫ్‌ వాడాలనే విషయంలో ఆర్థికపరమైన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అవసరమైతే ఈ ప్రతిపాదనను ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ హైపవర్‌ కమిటీ ఎదుట ఉంచి ఆమోదం పొందాలి.
  • 2017 జనవరి 28న అన్నారం బ్యారేజి ఆర్‌.సి.సి. డయాఫ్రం, సీకెంట్‌ పైల్‌ కటాఫ్‌ రెండింటికీ సీడీఓ డ్రాయింగులు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీకి 2017 మార్చి 29న రెండు డ్రాయింగులు ఇచ్చింది.
  • 2017 ఏప్రిల్‌ 19న కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ సీడీఓ చీఫ్‌ ఇంజినీర్‌కు లేఖ రాశారు. నిర్మాణ స్థలంలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మూడు బ్యారేజీల్లో సీకెంట్‌ పైల్‌ కటాఫ్‌ పద్ధతికి వెళ్లాలని నిర్ణయించామని, దీనికి డిజైన్‌లు, డ్రాయింగులు ఇవ్వాలని కోరారు.
  • అయితే 2017 జనవరి 16న అన్నారం బ్యారేజి నిర్మాణ సంస్థ ఆప్కాన్స్‌ ప్రాజెక్టు ఇంజినీర్‌కు లేఖ రాసింది. ఇందులో జనవరి 9న నీటిపారుదలశాఖ సమావేశంలో సీకెంట్‌ పైల్‌ కటాఫ్‌ పద్ధతికి వెళ్లాలని నిర్ణయించినట్లు అందులో పేర్కొంది. దీన్ని బట్టి జనవరిలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయం జరిగినట్లు స్పష్టమవుతోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని