ఫోన్‌ ట్యాపింగ్‌పై పక్కాగా విచారణ

‘‘ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తే ఏమవుతుందని కేటీఆర్‌ అంటున్నారు.. ఇలా బరితెగించి మాట్లాడేవారు దాని ఫలితం అనుభవిస్తారు. ట్యాపింగ్‌పై పక్కాగా విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Published : 30 Mar 2024 05:38 IST

బాధ్యులు జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు
భార్యాభర్తలు ఫోన్‌లో మాట్లాడుకున్నా.. విన్నారు
కేటీఆర్‌ బరితెగించి మాట్లాడుతున్నారు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తే ఏమవుతుందని కేటీఆర్‌ అంటున్నారు.. ఇలా బరితెగించి మాట్లాడేవారు దాని ఫలితం అనుభవిస్తారు. ట్యాపింగ్‌పై పక్కాగా విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బాధ్యులు చర్లపల్లి జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ట్యాపింగ్‌ చేయవద్దని ఆ రోజే తాము చెప్పినా అధికారులు వినలేదని.. దాని ఫలితాన్ని ఈ రోజు వారు అనుభవిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వాల్మీకి, బోయలతో శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ రోజు ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చాం. అంతకుముందు ఎవరైనా ఫోన్‌లో మాట్లాడుకోవాలన్నా భయం ఉండేది. గత ప్రభుత్వం.. ఓట్లేసిన ప్రజలనే భయపెట్టి, పోలీసు కేసులు పెట్టి ఫోన్‌ ట్యాపింగ్‌లు చేసి ఎవరేం మాట్లాడుకున్నా వినే దుర్మార్గమైన ఆలోచన చేసింది. భార్యాభర్తలు ఫోన్‌లో మాట్లాడుకున్నా.. విన్నారు.  కొద్దిమంది ఫోన్లు విన్నాం అని కేటీఆర్‌ ఇప్పుడు బరితెగించి మాట్లాడుతున్నారు. వింటే ఏమవుతుందని అంటున్నారు. ప్రజలు ఇళ్లల్లో మాట్లాడుకునే వాటితో మీకు అవసరం ఏంటి?. వాళ్లు చెప్పినట్లు ఆ రోజు విని ట్యాపింగ్‌ చేసిన అధికారులు ఈ రోజు ఊచలు లెక్కబెడుతున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేయవద్దని, వారి(భారాస నేతలు) మాట వింటే మీరు జైలుకు పోతారని అప్పుడే మేం అధికారులకు చెప్పాం.  వారు ఈ రోజు కేసుల్లో ఇరుక్కుంటే అయ్యో పాపం అని కూడా భారాస వాళ్లు అనడం లేదు. మేం ఇలాగే చేస్తాం అని కేటీఆర్‌ అంటున్నారు. గ్రామాల్లో పెద్దమనుషులు ప్రశ్నిస్తే.. మేం ఇలాగే చేస్తాం అని కొందరు అంటారు.. అలా మాట్లాడితే దాని ఫలితం దానికి ఉంటుంది. 

ఎమ్మెల్సీ ఎన్నికలో మంచి మెజార్టీతో గెలుస్తాం..

ఓటు విలువ తెలిసినందున నేను దిల్లీ నుంచి వచ్చి కొడంగల్‌ వెళ్లి ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేశాను. ఓటు వేశాక కొడంగల్‌లో అందరినీ కలసి యోగక్షేమాలు తెలుసుకుని వచ్చాను. ఉమ్మడి పాలమూరులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. గడీలు బద్దలు కొట్టి ప్రజా పాలన తెచ్చాం. లేకలేక మన జిల్లా(పాలమూరు)కు చెందిన నాకు ఒక అవకాశం వచ్చింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాలలో కూడా గెలిచేవాళ్లం. కానీ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముందు వరకూ భారాసతో పోరాడినట్లు చేసిన భాజపా నాయకురాలు డీకే అరుణ తీరా పోలింగ్‌ రోజున తన బంధువైన భారాస అభ్యర్థికి ఓట్లు వేయించారు. డీకే అరుణ ఐదేళ్లుగా భాజపాలో ఉన్నా పాలమూరుకు ఏం చేశారు? భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి తెచ్చుకున్న ఆమె పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తేలేదు?. రేవంత్‌రెడ్డిని దెబ్బతీయాలని భాజపా, భారాస కూడబలుక్కుని కుట్రలు చేస్తున్నాయి. పాలమూరు జిల్లాలో కూడా ఇదే రాజకీయం నడుస్తోంది. సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్‌ను పార్లమెంటు ఎన్నికల్లో ఓడిస్తే రేవంత్‌రెడ్డిని రాష్ట్రమంతా బలహీన పరచవచ్చని భారాస, భాజపాలు కిందిస్థాయిలో కుట్ర చేస్తున్నాయి. అలా కుట్ర చేసే పార్టీలో ఉన్న మిత్రులు నా దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పి పోతున్నారు. దేనికోసం ఓడిస్తారు ? మా నీళ్లు మాకు కావాలని కర్ణాటకతో మేం కొట్లాడుతున్నందుకు కాంగ్రెస్‌ను ఓడిస్తారా? ఇప్పుడు మళ్లీ భాజపా గెలిస్తే మోదీ చంద్రమండలానికి రాజు అవుతారా? గత పదేళ్లు మోదీ ఏం చేశారు? భాజపా నేతలు ఓట్ల కోసం వచ్చి పోతారు. కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వమే ప్రజలకు మేలు చేస్తుంది. అందరూ కలసి మంచి మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలి. ఎన్నికలైన తరవాత సీఎం కార్యాలయానికి వాల్మీకి, బోయలను పిలిపించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తా. కంచె వేసి గద్వాల కోటను కాపాడింది బోయలే. మీరు మాట ఇస్తే దానిపై నిలబడతారు. పాలమూరు జిల్లాలో రెండు సీట్లు గెలిపిస్తామని బోయలు మాట ఇవ్వాలి. వారికి ప్రభుత్వంలో మంచి హోదా ఇస్తాం. కష్టపడేవారందరికీ ఏదో పదవి ఇస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే సంపత్‌కు ఎన్నికల తరవాత ప్రభుత్వంలో మంచి పదవి ఇస్తాం’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు మల్లు రవి, వంశీచంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని