టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లో ఎన్నికల డబ్బు

రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రోజుకో బండారం బయటపడుతోంది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి(ఎస్‌ఐబీ)లో సమాచార ధ్వంసంపై మొదలైన దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ మలుపులు తిరుగుతోంది.

Updated : 30 Mar 2024 10:21 IST

గత అసెంబ్లీ ఎన్నికల వేళ తరలింపు.. ఓ ప్రధాన పార్టీ అభ్యర్థులకు అందజేత!
దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు బహిర్గతం
చంచల్‌గూడ జైలుకు మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రోజుకో బండారం బయటపడుతోంది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి(ఎస్‌ఐబీ)లో సమాచార ధ్వంసంపై మొదలైన దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ మలుపులు తిరుగుతోంది. తాజాగా టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావును అరెస్టు చేసి విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గత ప్రభుత్వ హయాంలో టాస్క్‌ఫోర్స్‌ను తన గుప్పిట్లో ఉంచుకున్న రాధాకిషన్‌రావు సిబ్బందిని అనధికారిక కార్యకలాపాలకు వినియోగించుకున్నారు. కేసుల దర్యాప్తునకే పరిమితం కాకుండా.. ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. ముఖ్యంగా గత నవంబరులో శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన ఆగడాలు పతాకస్థాయికి చేరాయి. సదరు పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం తన బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ క్రమంలో ఏకంగా టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లోనే డబ్బు తరలింపు చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి పలు ప్రాంతాల్లోని సదరు పార్టీ అభ్యర్థులకు డబ్బు పంపడంలో రాధాకిషన్‌రావు బృందం కీలకంగా వ్యవహరించింది. పోలీసు వాహనాలైతే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ఈ ఎత్తుగడ అమలు చేశారు. ఈ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల్లో పలువురిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తుండటంతో త్వరలోనే మరికొందరి అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాలు ఇమిడి ఉండటంతో ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్టును చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆధారాల ధ్వంసం సెక్షన్లు మాత్రమే ఉండటంతో పోలీసులు ఈ దిశగా ఆలోచిస్తున్నారు.

14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండు

రాధాకిషన్‌రావును సుదీర్ఘంగా విచారించిన అనంతరం శుక్రవారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయ్యాక కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లగా.. 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండు విధించారు. దీంతో రాధాకిషన్‌రావును చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా మీడియా ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా నిరాకరించారు. కానీ అంతకు ముందు బంజారాహిల్స్‌ ఠాణా నుంచి ఆసుపత్రికి తరలించే సమయంలో మాత్రం మీడియాకు అభివాదం చేస్తూ వెళ్లారు. న్యాయమూర్తి నివాసం వద్ద ఏసీపీ వెంకటగిరి మీడియాతో మాట్లాడుతూ.. రాధాకిషన్‌రావును పోలీసు కస్టడీకి తీసుకునేందుకు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేస్తామన్నారు. ‘రాధాకిషన్‌రావు ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైళ్లు రూపొందించి అక్రమంగా పర్యవేక్షించడంతోపాటు ఎన్నికల సమయంలో అక్రమంగా నగదు తరలింపులో కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది’ అని వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఎస్‌.ఎం.విజయ్‌కుమార్‌ తెలిపారు.

పోలీసు కస్టడీకి అదనపు ఎస్పీలు

చంచల్‌గూడ జైల్లో జ్యుడిషియల్‌ రిమాండులో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను హైదరాబాద్‌ పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో జైలు నుంచి తరలించారు. తొలిరోజు వీరిని పెద్దగా విచారించలేదని తెలిసింది. మరోవైపు అదుపులోకి తీసుకున్న రాచకొండ ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు నుంచి వాంగ్మూలం తీసుకున్న అనంతరం వదిలేశారు.


ప్రణీత్‌రావు ద్వారా ప్రత్యర్థుల కదలికలపై నిఘా

రాధాకిషన్‌రావు బృందం ప్రధాన పార్టీ నాయకులపై పోటీచేసే ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంలోనూ కీలకంగా వ్యవహరించింది. దీని కోసం ముందుగా పలువురు నేతలు, వ్యాపారుల ప్రొఫైళ్లు రూపొందించి ఎస్‌ఐబీ కార్యాలయంలో ప్రణీత్‌రావుకు ఇచ్చేవారు. అతను వారి కదలికలు, కార్యకలాపాలపై సాంకేతిక సాయంతో రహస్యంగా సమాచారం సేకరించి తిరిగి రాధాకిషన్‌రావుకు చేరవేసేవారు. దీని ఆధారంగా రాధాకిషన్‌రావు బృందం క్షేత్రస్థాయిలో ఆపరేషన్లు చేపట్టి ప్రధాన పార్టీ ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంపై దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన భుజంగరావు సైతం అదే పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రైవేటు ప్రొఫైళ్లు రూపొందించినట్లు దర్యాప్తులో బహిర్గతమైంది. భువనగిరిలో ఏసీపీగా ఉన్న భుజంగరావు అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం తొలుత అనిశాకు బదిలీ అయ్యారు. అతను విధుల్లో చేరక ముందే ఇంటెలిజెన్స్‌లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్కడ పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేస్తూ.. ప్రైవేటు ప్రొఫైళ్లను ప్రణీత్‌రావుకు అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని