నిందితులకు ‘క్రొమటోగ్రఫీ’ పరీక్ష!

రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు సైబరాబాద్‌ పోలీసులు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

Updated : 30 Mar 2024 05:41 IST

‘రాడిసన్‌ డ్రగ్స్‌’ కేసులో సైబరాబాద్‌ పోలీసుల నిర్ణయం
3 నెలల వరకు మాదకద్రవ్యాల ఆనవాళ్లు గుర్తించే వీలు
న్యాయస్థానం అనుమతి కోసం ప్రయత్నాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు సైబరాబాద్‌ పోలీసులు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. నిందితులకు ‘క్రొమటోగ్రఫీ’ డ్రగ్‌ టెస్ట్‌ నిర్వహించే దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ పరీక్ష ద్వారా నిందితులు డ్రగ్స్‌ తీసుకున్న మూడు నెలల వరకూ మూత్ర నమూనాల్లో ఆనవాళ్లను గుర్తించే వీలుంటుంది. ఈ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి కోరుతూ పోలీసులు ఇప్పటికే కూకట్‌పల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, అందుకు న్యాయస్థానం నుంచి అనుమతి లభించకపోవడంతో హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా పరీక్ష నిర్వహించిన దాఖలాలు లేకపోవడంతో ఈ అంశం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి రాడిసన్‌ హోటల్‌లో కొకైన్‌ పార్టీ జరిగినట్లు అందిన సమాచారంతో పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. హోటల్‌లోని 1200, 1204 గదులను తనిఖీ చేసి మూడు ఖాళీ ప్లాస్టిక్‌ పేపర్లతోపాటు ఒక వైట్‌ పేపర్‌ రోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో లభించిన తెల్లటిపొడి ఆనవాళ్లను డ్రగ్‌ కిట్‌లో విశ్లేషించి కొకైన్‌గా గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో 14 మందికి ప్రమేయముందని దర్యాప్తులో తేలింది. అప్పట్లోనే పోలీసులకు చిక్కిన ప్రధాన నిందితుడు గజ్జెల యోగానంద్‌తోపాటు మరో ఇద్దరి నమూనాల పరీక్షల్లో మాదకద్రవ్యాలు సేవించినట్లు తేలింది. కానీ, సినీ దర్శకుడు క్రిష్‌తోపాటు లిషి, సందీప్‌, శ్వేత, నీల్‌ తదితరులు మాత్రం తొలుత విచారణకు హాజరు కాలేదు.

సమయం గడిచేకొద్దీ మూత్ర విశ్లేషణలో డ్రగ్స్‌ ఆనవాళ్లు ఉండవనే కారణంతోనే నిందితులు కాలయాపన చేశారనే ఆనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మార్చి 1న క్రిష్‌ అనూహ్యంగా పోలీసుల ముందుకొచ్చి నమూనాలను ఇచ్చారు. మరో రెండు రోజులకే లిషి, సందీప్‌.. తదితర నిందితులూ హాజరై నమూనాలను ఇచ్చారు. వారి నమూనాలను విశ్లేషించడంతో నెగిటివ్‌ వచ్చింది. అయితే, పోలీసులు మాత్రం నిందితులు కాలయాపన చేయడంతోనే నమూనాల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు చిక్కలేదని బలంగా నమ్మి ‘క్రొమటోగ్రఫీ’ పరీక్ష దిశగా కసరత్తు ప్రారంభించారు.  సాధారణంగా ఎవరైనా మాదకద్రవ్యాలు సేవించారో తెలుసుకునేందుకు డ్రగ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. అందులో అనుమానిత ఆనవాళ్లు కనిపిస్తే నిందితుల మూత్ర నమూనాలు సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించి నివేదిక తెప్పిస్తారు. ఈ నివేదికనే అధికారికంగా న్యాయస్థానానికి సమర్పిస్తారు. అయితే, నిందితులు మాదకద్రవ్యాలు సేవించిన 72 గంటల్లోపు మూత్ర నమూనాలను విశ్లేషించినప్పుడే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో జరిపే పరీక్షలకు ఆనవాళ్లు చిక్కుతాయి. అంతకంటే ఆలస్యమయ్యేకొద్దీ ఆనవాళ్లు లభించడం కష్టమవుతుంది. రాడిసన్‌ హోటల్‌ది హైప్రొఫైల్‌ కేసు కావడంతో సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని క్రొమటోగ్రఫీ డ్రగ్‌ టెస్ట్‌ చేయాలని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని