రాజన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలి

రాజన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొందని, నాలుగు నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Published : 30 Mar 2024 04:12 IST

సీఎంకు బండి సంజయ్‌ లేఖ

తెలంగాణచౌక్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: రాజన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొందని, నాలుగు నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. లేఖ ప్రతులను ఆయన మీడియాకు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.270 కోట్లు ఇంతవరకు విడుదల చేయలేదని, కొత్త ఆర్డర్లు రాని కారణంగా వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన దాదాపు 20 వేల మంది పవర్‌లూమ్‌, అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారని ఆయన తెలిపారు. బకాయిలు చెల్లించి, కొత్త ఆర్డర్ల జారీతో వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని సీఎంను కోరారు. పవర్‌లూమ్‌ కార్మికులకు గత 24 ఏళ్ల నుంచి 50 శాతం రాయితీతో అందిస్తున్న విద్యుత్తును నిలిపివేయడంతో రెట్టింపు బిల్లులు వస్తున్నాయని, తక్షణమే విద్యుత్తు బకాయిలను మాఫీ చేసి, రాయితీని యథావిధిగా కొనసాగించాలని పేర్కొన్నారు. వర్కర్‌ టూ ఓనర్‌ పథకం అర్ధాంతరంగా నిలిచిపోయిందని, ఈ పథకాన్ని వెంటనే ప్రారంభించడంతో పాటు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం నుంచి గట్టెక్కేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంజయ్‌ సీఎంను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని