దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌

ఖైరతాబాద్‌ నుంచి భారాస ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ అదే నియోజకవర్గంలోని ఓటరు బి.రాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 30 Mar 2024 04:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ నుంచి భారాస ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ అదే నియోజకవర్గంలోని ఓటరు బి.రాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ భారాస తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లోకి చేరి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఇది ఓటర్లను అయోమయానికి గురి చేస్తుందన్నారు. దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు మెయిల్‌ ద్వారా వినతి పత్రం సమర్పించామని, దానిపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్‌ వేసే అర్హత పిటిషనర్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఓటరు ఇచ్చిన ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌కు ఆదేశాలివ్వజాలమని పేర్కొన్నారు. పార్టీలు మారడం అన్నది దేశంలో సాధారణమైపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వినతి పత్రంపై నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశాలివ్వడంపై ఏవైనా తీర్పులుంటే సమర్పించాలని పేర్కొంటూ విచారణను వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు