అమ్మో ఎండ.. అప్రమత్తతే అండ

భానుడు అప్పుడే భగభగమంటున్నాడు.. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.

Updated : 30 Mar 2024 04:32 IST

శరీరం నుంచి నీరు బయటికి వెళ్లడంతోనే సమస్యలు
మూత్రపిండాల్లో రాళ్లు, ఇతర ఇబ్బందులు తలెత్తే ఆస్కారం
వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలి
‘ఈనాడు’తో కిమ్స్‌ హాస్పిటల్స్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌, ఇంటర్నల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ డా.ప్రవీణ్‌కుమార్‌ కులకర్ణి
ఈనాడు - హైదరాబాద్‌

భానుడు అప్పుడే భగభగమంటున్నాడు.. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్‌, మే నెలలతోపాటు జూన్‌ ప్రథమార్థం వరకు సూర్యతాపం కొనసాగనున్న నేపథ్యంలో తగినంత నీటిని తీసుకుంటూ, శరీర ఉష్ణోగ్రతలను గమనించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేసవి ఆరోగ్య సమస్యలు అధిగమించవచ్చని కిమ్స్‌ హాస్పిటల్స్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌, ఇంటర్నల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ డా.ప్రవీణ్‌కుమార్‌ కులకర్ణి చెబుతున్నారు. వేసవిలో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన ‘ఈనాడు’తో పంచుకున్నారు.

సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు

ఎండలు ఎక్కువైనప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తద్వారా శరీరంలో నీరు బాగా పోవడం వల్ల నిర్జలీకరణ(డీహైడ్రేషన్‌)తో హీట్‌ క్రాంప్స్‌, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, విరేచనాలు, గుండెలయలో మార్పులు, రక్తపోటు(బీపీ)లో హెచ్చుతగ్గులు, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రనాళ సమస్యలు, వేడి దద్దుర్లు(హీట్‌ ర్యాషెస్‌) వచ్చే అవకాశం ఉంటుంది.

కండరాలకు తగినంత ఆక్సిజన్‌ అందక..

వేసవిలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. తగినంత నీరు తాగకపోవడంతోపాటు, గాలిలో తేమశాతం తక్కువగా ఉన్నందువల్ల శరీరంలో నీరు బయటకు పోతుండటంతో సమస్యలు వస్తాయి. మన శరీరంలో కండరాలకు తగిన ఆక్సిజన్‌ అవసరం. ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరంలో నీరు తగ్గినప్పుడు మజిల్‌ క్రాంప్స్‌(కండరాలు పట్టేయడం)కు దారి తీస్తుంది. కండరాలకు శరీరం నుంచి తగిన ఆక్సిజన్‌ అందనప్పుడు ఇది ఇతర మార్గంలో అవసరాలు తీర్చుకునే క్రమంలో ల్యాక్టిక్‌యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఆ సమస్య ఉన్నవారికి మరింత నష్టం కలిగిస్తుంది. కొన్నిసందర్భాల్లో ర్యాబ్డోమైలోసిస్‌ వచ్చి కిడ్నీలు ఫెయిల్‌ అయ్యే అవకాశం ఉంటుంది. నీళ్ల విరేచనాలు సైతం ఒక్కోసారి మూత్రపిండాలు విఫలమవడానికి కారణమవుతాయని గుర్తించాలి.

తలనొప్పి.. మానసిక ఆందోళన

వేసవిలో రక్తపోటు(బీపీ) మందులు వాడే వారు వైద్యులను సంపద్రించి వారి సూచనల మేరకు రెండు మూడు నెలల పాటు మార్పులు చేసుకోవడం అవసరం. ఈ కాలంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు తలనొప్పిని తొలి హెచ్చరికగా భావించాలి. వెంటనే తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఒత్తిడి, చికాకు, నిద్రలేమి, ఉత్సాహం తగ్గి నీరసించడం వంటివి ఎక్కువమందిలో బయటపడుతున్నాయి. 

చల్లటి నీరు వద్దు.. అతి వ్యాయామంతో అనర్థం

సాధారణంగా ఎండ నుంచి రాగానే చల్లగా ఉన్న నీరు తాగడం... చన్నీటిని కాళ్లు, తలపై పోసుకోవడం లేదా స్నానం చేస్తుంటారు. కానీ ఇది తీవ్ర అనారోగ్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది. బాగా ఎండలో నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారిగా బాగా చల్లగా ఉన్న నీరు ఉపయోగిస్తే చిన్న రక్త నాళాలు కుంచించుకుపోయి గుండెపోటుకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఎండలో నుంచి వచ్చిన తర్వాత వెంటనే సాధారణమైన నీటిని తాగాలి. అరగంట వరకు చన్నీళ్లతో స్నానం చేయకపోవడం, కాళ్లపై పోసుకోకపోవడం మంచిది. విపరీతంగా వ్యాయామం చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. తగిన విరామంతో సరిపడినంత నీరు తీసుకుంటూ వ్యాయామం చేయాలి. ఈ కాలంలో అతి చల్లటి నీరు, లేదా ఇతర ద్రవపదార్థాలు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. బాగా చల్లగా ఉన్నవాటిని తాగడం వల్ల గొంతునొప్పి, ఇతర సమస్యలకు దారి తీస్తాయని గుర్తించాలి.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

రీర ఉష్ణోగ్రతలు కాపాడుకోవడానికి నీరు తాగుతుండాలి. చల్లటి ప్రదేశాల్లో ఉండేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించే మాత్రల కోసం కొందరు వెతుకుతుంటారు. అటువంటివి ఉండవు. సీ విటమిన్‌ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. పలుచటి వస్త్రాలు ధరించడం ముఖ్యం. ఏకధాటిగా ఎండలో ఉండకుండా మధ్య మధ్యలో విరామం ఇవ్వాలి. తీవ్రమైన ఎండ ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడం అన్ని విధాల శ్రేయస్కరం. వయసురీత్యా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలి. వేసవిలో బ్యాక్టీరియా చేరి త్వరగా ఆహార పదార్థాలు చెడిపోతాయి. ఇలాంటివి తీసుకున్నపుడు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. అందుకే తాజా ఆహారం తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని