నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల లైడార్‌ సర్వేకు సన్నాహాలు

నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు నీటిపారుదల శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది.

Published : 30 Mar 2024 04:23 IST

డీపీఆర్‌ పూర్తిచేసి టెండర్లు పిలిచేందుకు కసరత్తు
పనుల్లో వేగం పెంచనున్న నీటిపారుదల శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు నీటిపారుదల శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌, నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గాల పరిధిలోని 10 మండలాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. నాలుగు దశల్లో ఎత్తిపోతలకు బదులు మూడు దశలకు మార్చడం, భూగర్భ సొరంగాల స్థానంలో ప్రెషర్‌ మెయిన్‌ (పైపుల మార్గం) ఏర్పాటు చేసేలా ఈ ఎత్తిపోతల పథకం డిజైన్లలో మార్పులు కూడా చేశారు. కాగా ఈ పథకం సమగ్ర సర్వేకు సంబంధించి లైడార్‌ సర్వే నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. ఈ మేరకు హెలికాప్టర్‌ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. సర్వే ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులతోపాటు నీటిని సేకరించే స్థానం మొదలుకొని ఎత్తిపోతలు, అప్రోచ్‌ కాలువలు, ప్రెషర్‌ మెయిన్‌ వెళ్లే మార్గం, జలాశయాల నిర్మాణం, ఉన్న చెరువుల సామర్థ్యం పెంచి వాటిని పటిష్ఠం చేయడం లాంటి వాటిపై ఒక సమగ్ర అంచనాకు వచ్చే అవకాశాలున్నాయి.

‘పాలమూరు’ ఏజెన్సీకే బాధ్యతలు!

నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం సమగ్ర సర్వే బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయమై నీటిపారుదల శాఖ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. రూ.2,945 కోట్లతో చేపట్టే ఈ పథకానికి (ప్రెషర్‌ మెయిన్‌కు మారాక రూ.500 కోట్లు పెరగనున్నట్లు అంచనా) ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. పనులకు శంకుస్థాపన కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పనులు మొదలు పెట్టేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌) రూపకల్పన అనంతరం టెండర్లు పిలవాల్సి ఉంది. అయితే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని రెండు జలాశయాల కింద     కాలువల ద్వారా నారాయణపేట-కొడంగల్‌ ప్రాంతాలకు సాగు, తాగునీరు ఇచ్చేందుకు టెండర్లు కూడా పిలిచారు. ప్రస్తుతం ఈ పనులను రద్దు చేసి కొత్త అలైన్‌మెంట్‌ ప్రకారం లిఫ్టును నిర్మించనున్నారు. ఈ క్రమంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సర్వే చేసిన సంస్థకే ప్రస్తుత సర్వే బాధ్యతలు అప్పగించాలని నీటిపారుదల శాఖ భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై కొద్ది రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు