పాడి, మత్స్య రైతులకు రుణసాయం గగనమే!

పాడి పరిశ్రమ వంటి వ్యవసాయానుబంధ రంగాలను ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిస్తున్నా.. బ్యాంకులు రుణసాయానికి వెనకాడుతున్నాయి.

Published : 30 Mar 2024 04:24 IST

 కేంద్రం ఆదేశించినా మొరాయిస్తున్న బ్యాంకులు

ఈనాడు,హైదరాబాద్‌: పాడి పరిశ్రమ వంటి వ్యవసాయానుబంధ రంగాలను ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిస్తున్నా.. బ్యాంకులు రుణసాయానికి వెనకాడుతున్నాయి. పాడి పశువుల కొనుగోలుకు, చేపల పెంపకానికి రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న అన్నదాతలను అవి పట్టించుకోవడం లేదు. వచ్చిన దరఖాస్తులను భారీగా తిరస్కరిస్తున్నాయి. కొన్నింటినే ఆమోదిస్తూ... రుణం విడుదలలో సైతం తీవ్ర జాప్యం చేస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి విరివిగా రుణాలివ్వాలని కేంద్రం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల కింద పాడి రైతులతోపాటు చేపల పెంపకందారులకు రుణసాయం అందించాలని సూచించినా ఫలితం లేకుండా పోయింది.

కేంద్ర నిర్దేశాలకు అనుగుణంగా తమకు సాయం అందుతుందనే ఆశతో రాష్ట్రవ్యాప్తంగా 11,161 మంది పాడి రైతులు బ్యాంకుల్లో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా వరంగల్‌ జిల్లా నుంచి 3477, నాగర్‌కర్నూల్‌ 950, నిజామాబాద్‌ 865, ఖమ్మం 800, హనుమకొండ 681, భద్రాద్రి 455, మంచిర్యాల 446, వనపర్తి 401, నారాయణపేట 339, సంగారెడ్డి 291, జనగామ 265, మేడ్చల్‌-మల్కాజిగిరి 265, ఆసిఫాబాద్‌ 259, కామారెడ్డి 253, సిద్దిపేట జిల్లా నుంచి 214, ఇతర జిల్లాల నుంచి 200 కంటే తక్కువగా దరఖాస్తులు వచ్చాయి.   కేవలం 3,782 మందికే రుణాలను మంజూరు చేశాయి. అందులోనూ దాదాపు 1000 మందికే ఇప్పటి వరకు రుణాలు అందాయి. చేపల పెంపకానికి రుణాల కోసం 6,968 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,641 మందికి మాత్రమే మంజూరయ్యాయి. వీరిలోనూ ఇప్పటి వరకు 1500 మందికే రుణం అందింది. వరంగల్‌ జిల్లా నుంచి 2,397, సంగారెడ్డి 777, గద్వాల 698, యాదాద్రి 466, సూర్యాపేట 405, భద్రాద్రి 289, వికారాబాద్‌ 244, మేడ్చల్‌-మల్కాజిగిరి 226, కామారెడ్డి జిల్లా నుంచి 221, ఇతర జిల్లాల నుంచి 200 కంటే తక్కువ దరఖాస్తు అందాయి. పాడి, మత్స్య రైతులకు రుణసాయం చేయకుండా బ్యాంకులు మొరాయించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి.. ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నా ఫలితం ఉండటం లేదు. వాస్తవానికి వీరికి రుణమాఫీ పథకాలు లేవు. రుణం తీసుకున్న వారు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నా కొత్త రుణాలివ్వడానికి బ్యాంకులు చొరవ చూపడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని